ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 40 ; పప్పూరు రామాచార్యులు

336views

1896 నవంబరు 8న జన్మించిన రామాచార్యులు తండ్రి వద్దనే ప్రాధమిక విద్యనేర్చాడు. ఉన్నత పాఠశాల విద్య రాజమహేంద్రంలో ముగించుకొని ఇంటర్మీడియేట్ కోర్సు (1914-16) మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేశారు. బి.ఏ., చదువుకు తిరిగి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశించారు. ఆ దినాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అనంతపురంలో అధ్యాపకులుగా వుండేవారు. రామాచార్యులు వారికి ప్రీతిపాత్రుడుగా మెలిగేవారు.

1917 – 18లో అనంతపురం కళాశాల విద్యార్థులు 15 రోజుల (పక్షము)కొకసారి ఒక కరపత్రం వేసేవారు. సాంఘిక దురాచారాలను ఖండిస్తూ హాస్య పూరితంగా సాగిన ఈ వ్యాసాలు 1932లో “వదరుబోతు” గ్రంథంగా ప్రచురింపబడింది.కరపత్రాలలో మొత్తం యాభై పైగా వ్యాసాలు వేసినా ఇరవై రెండు వ్యాసాలు మాత్రమే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. రామాచార్యులు వదరుబోతు వ్యాసాలలో కొన్నిటిని రచించటమే గాక, కొన్నిటిని ప్రచురించారు కూడా.

గాంధీజీ బోధనలకు ప్రభావితుడైన రామాచార్యులు తన ఆప్తమిత్రులు కైప సోదరులు సుబ్రహ్మణ్యశర్మ, మహానందయ్యగార్లతో కలిసి మద్యంపై పోరాటం మొదలుపెట్టారు. ఊరూరూ తిరిగి ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. దానివల్లే బాలుడుగా ఉన్న తనలో మధ్యపాన విముఖత ఆనాడే కలిగించినదని తరువాత మద్రాసు రాష్ట్రంలో మద్యనిషేధశాఖామంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలిపారు. పప్పూరు వారు నీలం సంజీవరెడ్డికి బాల్యంలో ట్యూషన్ చెప్పారు. వారి ఇంటికి వెళ్లి ఇంగ్లీషు బోధించేవారు.

1922 సెప్టెంబరు 16న పినాకిని’ మొదటి సంచిక వెలువడింది. సంపాదకుడు వప్పూరి రామాచార్యులు. ముద్రాపకుడు కైప సుబ్రహ్మణ్య శర్మ. పినాకిని ప్రధాన వ్యాసాలన్నీ పప్పూరి రామాచార్యులే వ్రాసేవారు.

అనంతరం ఆచార్యులవారు స్వార్జితంతో ‘సాధన’ ప్రెస్సును స్థాపించి ప్రెస్సు పేరిటనే ‘శ్రీ సాధన’ అనే వారపత్రికను నాలుగు దశాబ్దాలు సమర్ధవంతంగానిర్వహించారు. రాయలసీమ ఇతర జిల్లాల కంటే అనంతపురం జిల్లా జాతీయోధ్యమంలో ముందున్నదంటే అందుకు కారణం శ్రీరామాచార్యులు ‘సాధన’ పత్రిక ద్వారా చేసిన కృషేనని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఐదుకల్లు సదాశివన్ గారు పేర్కొన్నారు.

1932లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా 1932 జనవరి 23 ఏడాది పాటు బళ్ళారి జైలులో గడిపారు రామాచార్యులు గారు. క్విట్ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 సెప్టెంబరు 3నుండి 1943 డిశంబరు 17 వరకు వేలూరు, తంజావూరు జైళ్ళలో గడిపారు. 1942 వేలూరు జైలులో ఉన్నప్పుడు తొమ్మిది నెలల పాటు రామాయణాన్ని, ఆరు నెలల పాటు శాకుంతలం నాటకాన్ని ఖైదీలకు వీనుల విందుగా వివరించారు రామాచార్యులు. వీరికి సహచర ఖైదీలు 116 రూపాయలు, దుశ్శాలువానిచ్చి సత్కరించారు.

1947లో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో రామాచార్యులు పోటీలేకుండా అనంతపురం మునిసిపల్ కౌన్సిల్లో సభ్యులైనారు. సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా మునిసిపల్ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. వీరు మునిసిపల్ చైర్మన్ గా నున్న దినాలలో అనంతపురం మునిసిపాలిటీ పారిశుద్ధ్యము, ఆరోగ్యం, నీటి సప్లయి, దీపాలు, రోడ్లు, కాలువలు, వంతెనల నిర్మాణాలు మొదలగు అన్ని పనులలో అభివృద్ధి సాధించింది.

జిల్లా మార్కెటింగ్ సొసైటీ కూడా వీరి హయాంలోనే ప్రగతి సాధించింది.కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి డైరక్టరుగా, భూమి తనఖా బ్యాంకు డైరక్టరుగా వీడు ఆయా సంస్థల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ‘సహకార’ పత్రికకు సంపాదకులుగా రాష్ట్ర సహకారం సంఘ ఉపాధ్యక్షులుగా ఆచార్యుల వారి కీర్తి రాష్ట్ర నలుమూలలా వ్యాపించింది. ఈ హోదాలో వారు శ్రీలంక వెళ్లిన అధ్యయన బృందంలో సభ్యులుగా వున్నారు.

1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పడినపుడు తొలి అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కల్గింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సరియైన భవనం దొరకలేదు. తన ఇంటిలోని మూడు గదులను గ్రంథాలయ అవసరాలకు ఇచ్చేశారు. 1934 డిసెంబరులో తిమ్మంపల్లి గ్రంథాలయ వార్షికోత్సవంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ “పూర్వకాలంలో కాశీ యాత్రికులకు అన్నసత్రాలు పెడితేపుణ్యం వస్తుందని భావించేవారు. ఈనాడు ఇదికాదు కావలసింది, గ్రంథాలు కొని గ్రంథాలయాలకు బహూకరించడం, వార్తాపత్రికలకు చందాలు చెల్లించి గ్రంథాలయాలకు అందజేయడం ముక్తినిచ్చే సత్కర్యాలని పేర్కొన్నారు.

1955 లో రాష్ట్రమంతటా ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, ప్రజాపార్టీల కలయికతో ఏర్పడిన ఐక్య కాంగ్రెస్ అభ్యర్థిగా పప్పూరువారు కాంగ్రెస్ గుర్తుపై ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 1956నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో 1960లో శాసనసభ్యుల పదవీకాలం పూర్తి కావల్సివున్నప్పటికీ 1962 వరకూ పొడిగించబడింది. ఫలితంగా 1955లో శాసనసభ్యులైన వారు 7 సంవత్సరాలు శాసనసభ్యులుగా కొనసాగారు. ఆచార్యులవారి శిష్యుడు నీలం సంజీవరెడ్డి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెసులో గ్రూపులు ప్రబలినవి, నీలం సంజీవరెడ్డి ప్రభృతులు మద్రాసులో ప్రకాశం ప్రభుత్వం పడిపోవడానికి కృషిచేశారు. దాంతో నొచ్చుకున్న రామాచార్యులు కాంగ్రెసు చిల్లులు పడిన పడవ అనీ కాంగ్రెసు ప్రతిష్ఠ దిగజారుతున్నదని “శ్రీ సాధన”లో వ్రాశారు.

ఆచార్యుల వారికి ముగ్గురు మగబిడ్డలు శేషాచార్యులు, నరసింహాచార్యులు, అనంతకృష్ణలు. ఏడుగురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె శ్రీమతి లక్ష్మీదేవి. అల్లుడు శ్రీ గోపాలచార్యులు. రామాచార్యుల శతజయంతి సందర్భంగా రామనగరులో రామాచార్యుల శిలా విగ్రహం ఏర్పడటానికి ఈ దంపతుల కృషి పట్టుదలలే కారణం. పేదరికం ఎంత దుర్భరంగా వున్నా రామాచార్యులు అతిథులను ఆదరించడం మాత్రం మానలేదు. ఈ విషయంలో సతీమణి సహకారం వీరికి పుష్కలంగా లభించింది. సంప్రదాయం పాటిస్తున్నా సంఘంలో మార్పులను ఆహ్వానించిన రామాచార్యులు గుంటూరు సుబ్బరాయుడు, ఐదుకల్లు సదాశివన్ గార్లను తన సహపంక్తి భోజనానికి కూర్చోబెట్టుకునేవారు.

ఎలాంటి పరిస్థితులలో కూడా అక్రమ మార్గాలకు పాల్పడక, అవినీతి పరుల చర్యలను తీవ్రంగా ఖండించిన రామాచార్యుల వారు 1972 మార్చి 21న 76 సంవత్సరాల వయస్సులో పరమపదించారు.