ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 35 ; మాడభూషి అనంతశయనం అయ్యంగార్

278views

నిస్వార్థ దేశభక్తుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, సమర్థుడైన లోక్ సభ స్పీకర్, గొప్ప పండితుడు, మంచి గవర్నర్.. అన్నిటికీ మించి నిరాడంబరుడు, సద్గుణశీలి, వినయ సంపన్నుడు, కర్మయోగి శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్.

పుణ్యక్షేత్రాల నిలయమైన చిత్తూరు జిల్లాలో శ్రీ పద్మావతీదేవి కొలువైవున్న తిరుచానూరు పుణ్యక్షేత్రంలో 1891 ఫిబ్రవరి 4వ తేదీన, అనంతశయనం అయ్యంగార్ జన్మించారు.

మాడభూషి వారి బాల్యం పేదరికంలోనే గడిచింది. తిరుచానూరులో కొద్దిపాటి ఆదాయంతో వారి కుటుంబం గుట్టుగా జీవితాన్ని గడిపేది. ఆర్ధిక ఇబ్బందుల మధ్యనే ఆయన జీవన ప్రయాణం సాగింది. ప్రాథమిక విద్య తిరుచానూరులోనే అభ్యసించాక, ఉన్నతవిద్యకోసం తిరుపతి వెళ్లవలసివచ్చింది. రోజూ తిరుచానూరు నుండి తిరుపతి నడచి వెళ్లి చదువుకొనేవారు. ఆర్ధిక ఇబ్బందులకు తోడు, బాల్యంలో ఆయన తండ్రిని కోల్పోయారు. అది ఆయనకు తగిలిన పెద్ద దెబ్బ, అయితే అన్నగారు లో ఆయనను దగ్గరకు తీసుకొని, చదువు ఆగిపోకుండా చేశారు.

అనంతశయనం మొదటినుండీ తెలివైన విద్యార్థి. అందువల్ల మెట్రిక్యులేషన్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఆ రోజుల్లో స్వతంత్ర భావాలు ఉన్న అందరినీ ఆకర్షించేది న్యాయశాస్త్రవిద్య. అందుకే, వారు మద్రాస్ లోని పచ్చయ్యప్ప కళాశాలలో న్యాయవిద్య చదివారు. న్యాయవాద పట్టా వచ్చిన తరువాత, ఆయన తిరుపతి తిరిగి వచ్చి, కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

చిత్రమైన పరిస్థితులలో 1922లో చిత్తూరు మునిసిపాలిటీకి అధ్యక్షుడిగా అనంతశయనం ఎన్నిక కావడంతో, ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. అదే కాలంలో తిరుపతిలో ఉండే తెంగలై, వడగలై అనే వైష్ణవ శాఖల మధ్య వచ్చిన చిహ్నాల కేసును సమర్థవంతంగా వాదించి గొప్ప గుర్తింపు పొందారాయన. 1937లో అనంతశయనం లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. ఆ రోజుల్లో ఆయన చురుకుదనాన్ని, పనితీరుని చూసిన అందరూ అనంతశయనాన్ని”నడుస్తున్న విజ్ఞాన సర్వస్వ”మని ప్రశంసించేవారు. 1937 నుండి 1942 వరకూ ఎంతో సమర్ధవంతంగా తన బాధ్యతల్ని నిర్వహించారు.

స్వాతంత్ర్య సమరంలో అతి ముఖ్యమైన ఘట్టం శాసనోల్లంఘన ఉద్యమం. ఆ ఉద్యమంలో మహాత్మాగాంధీజీ పిలువు నందుకొని అనంతశయనం ఎంతో ఉత్సాహాన్ని, తెగువని చూపించారు. ముఖ్యంగా వేంకటేశ పత్రికతోపాటుగా, ఇతర పత్రికల్లోనూ ఆయన ఎన్నో వ్యాసాలు వ్రాసేవారు. ఈ పరిస్థితులలో, అనంతశయనాన్ని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వేలూరు సెంట్రల్ జైలులో పద్దెనిమిది నెలలు జైలు శిక్షను అనుభవించారాయన. ఆ తరువాత సత్యాగ్రహ ఉద్యమంలో చిత్తూరు సభలో మాట్లాడుతున్న అనంతశయనంను పోలీసులు అరెస్ట్ చేసి, తిరుచ్చిరాపల్లి జైలులో నిర్బంధించారు. అక్కడినుండి నాగపూర్ కు దగ్గరలో ఉన్న అమరావతీ జైలులో మరికొంతకాలం జైలుశిక్ష అనుభవించారు.

మానవసేవే మాధవ సేవ అనే సూక్తిని అక్షరాల పాటించారు. తాను పుట్టిపెరిగిన తిరుచానూరు, తిరుపతిలో వివిధ దేవాలయాల వద్ద యాచకులుగా మారిన కుష్టురోగుల పరిస్థితి అయ్యంగార్ ను కదిలించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి 1938లో చిత్తూరు, తిరుపతిలలో కుష్టు వ్యాధి నివారణ కేంద్రం ఏర్పాటు చేశారు.వారికి వైద్య సాయంతో పాటు వారి పిల్లల కోసం పాఠశాల, కూరగాయలు, గోధుమలు పండించుకునేందుకు తహసీల్దార్ తో మాట్లాడి పది ఎకరాల ప్రభుత్వ భూమిని సంపాదించారు. వారికి పింఛన్ కూడా మంజూరు చేయించడంతోపాటు వారికి అవసరమైన పాదరక్షలను ఆర్కాట్ లో తయారయ్యేలా చూశారు.

మా తెలుగుతల్లికి గీత రచయిత శంకరంబాడి సుందరాచారి ఆయనకు సమీప ఆ బంధువు. తెలుగుతల్లి రచనకు అయ్యంగారే స్ఫూర్తి అని సుందరాచారి చెప్పేవారు. వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసిన అయ్యంగార్ చివరి రోజుల్లో తీవ్రంగా అనారోగ్యపడి తిరిగి కోలుకొన్నారు. కానీ హఠాత్తుగా 1978వ సంవత్సరం మార్చి 19వ తేదీన తిరుపతిలో మరణించారు.