News

సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోం : అమిత్ షా

355views

ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇందుకోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నటికీ వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. సీఏఏపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

‘‘రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అమిత్ షా వెల్లడించారు.