News

రాష్ట్రవ్యాప్తంగా కిటకిటలాడిన శైవక్షేత్రాలు

243views

మహా శివరాత్రి ఘడియల్లో రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం, కోటప్పకొండతోపాటు, పంచారామ క్షేత్రాల్లో లింగరూపధరుడైన మహాశివుని దర్శించి భక్తులు పులకించిపోయారు. హరోం..హరా.. శంభో శివ శంకరా అంటూ శివనామస్మరణ చేశారు. శ్రీశైలంలో మల్లికార్జున, భ్రమరాంబికాదేవి కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. శ్రీగిరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. కర్ణాటక నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తజనంతో శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న, భ్రమరాంబికా దేవిలకు ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, బంగారు అభరణాలు, పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించి పెళ్లి పీటలపై ఆశీనులను గావించారు. వేదపండితులు పెళ్లి మంత్రాల నడుమ ఆదిదంపతులు ఒకటయ్యారు. శివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాల్లో లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కల్యాణం నిర్వహిస్తారు. కానీ ఏ క్షేత్రంలోనూ లేని విధంగా శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు కల్యాణం సమయంలో మల్లికార్జునుడికి పాగాలంకరణ వేడుక నిర్వహిస్తారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ కార్యక్రమం మొదలైంది. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు పృఽథ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. ఇతర ప్రాంతాల భక్తులు తీసుకువచ్చే పాగాలను కూడా స్వామికి అలంకరిస్తారు. పండితులు, ప్రధాన అర్చకులు ఓ వైపు శాస్త్రోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవ కార్యక్రమాన్ని చేపట్టగా, మరోవైపు వెంకటేశ్వర్లు పాగాలంకరణను మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్వామి వారి భక్తుల శివనామస్మరణతో నల్లమల కొండలు మార్మోగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సంఽధ్యవేళ నిర్వహించిన ప్రభోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు కోలాటం, నందికోలు సేవ, నృత్యాలతో ఉత్సవమూర్తుల ప్రభోత్సవానికి స్వాగతం పలికారు.

కిటకిటలాడిన కోటప్పకొండ
పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. లక్షలాది మంది భక్తులు కోటయ్యస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామికి అభిషేకాలు అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. అర్ధరాత్రి స్వామికి లింగోద్భవ అభిషేకాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించటంతో ప్రభుత్వం తరఫున త్రికోటేశ్వరస్వామివారికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు, వెండి ప్రభ సమర్పించారు. ప్రభల పండుగగా పేరొందిన కోటయ్య తిరునాళ్లలో 21 భారీ విద్యుత్‌ ప్రభలు కొలువు తీరాయి. భక్తుల శివనామ స్మరణ కొండ ప్రాంతం అంతా మారుమోగింది. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ అధికమై అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్వామిని దర్శించుకున్నారు.

దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీశివభక్త మార్కండేయ వంశీకులు శుక్రవారం పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్టు ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, విభూది, ఫల పుష్పాలతో కూడిన 11 రకాల సంప్రదాయ వెదురు పళ్లేలతో సమర్పించారు.