
హిందూ ధర్మపరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ధర్మ మార్గంలో నడవాలని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విజయయాత్రలో భాగంగా మహానంది క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధాని, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో అనుగ్రహ భాషణం నిర్వహించారు. హిందూ ధర్మపరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ధర్మం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ అధర్మాన్ని వీడి సత్యమార్గంలో నడవాలని కాంక్షించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలన్నారు. . హిందూ ధర్మంలో భగవంతుడి ఆరాధన ఎంతో కీలకమని, ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటే ఆ గ్రామం, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. మహానంది ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని అన్నారు. స్వయంభువుగా వెలిసిన శ్రీ మహానందీశ్వరస్వామి పశ్చిమాభిముఖంగా ఉంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారన్నారు. అనంతరం రాత్రి స్థానిక అభిషేక మండపంలో శ్రీ శారదా సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజలు నిర్వహించారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, మాజీ చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి, తదితరులు పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు.




