ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 27 ; పింగళి వెంకయ్య

300views

మన దేశానికి కూడా ఒక జాతీయ పతాకం కావాలని మనకు స్వరాజ్యం రావడానికి పూర్వమే చాలాకాలం క్రిందట, అంటే 1907లో ఒక మహామేధానికి, ఒక అకళంక దేశభక్తుడికి కోరిక కలిగింది. ఆ మహనీయుడు, ఆ బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీ పింగళి వెంకయ్యగారు.

పింగళి వెంకయ్యగారు ఆగష్టు 2, 1878 తేదీన ఆంధ్రరాష్ట్రంలోని కృష్ణాజిల్లా గ్రామమైన భట్లపెనుమర్రు మాతామహుల ఇంట జన్మించారు. వీరి తండ్రి హనుమంతరావు గారు దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. వెంకయ్యగారు పెదకళ్ళేపల్లిలో ఊళ్ళో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్నారు. లోయర్ సెకండరీ పరీక్ష 1890లో పాస్ అయినారు. తరువాత బందరు హిందూ హైస్కూల్లో హైస్కూలు చదువు పూర్తిచేసుకున్నారు.

తరువాత బొంబాయికి వెళ్ళి తన 19వ ఏట యుద్ధ సైనికుడిగా చేరి, ఆఫ్రికాకు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న బోయరు యుద్ధంలో పాల్గొన్నారు. మదరాసులో ప్లేగు ఇన్స్పెక్టరు ట్రయినింగులో ప్రప్రథముడుగా ఉత్తీర్ణుడై, బళ్ళారిలో ప్లేగు ఇన్స్పెక్టరుగా కొంతకాలం పనిచేశారు. ఆయనకు చదువుమీద ఆసక్తి ఎక్కువగా ఉండటంచేత ఉద్యోగం మాని, సిలోను దేశానికి వెళ్ళారు. అక్కడ కొలంబో నగరంలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనామిక్సు అభిమాన సబ్జెక్టు విషయంగా తీసుకుని కేంబ్రిడ్జి సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

ఇంటికి తిరిగివచ్చి మదరాసు – బెంగుళూరు రైలు మార్గంలో గార్డుగా 1906లో చేరి కొంతకాలం పనిచేశారు. ఆయన విద్యాపిపాస తీరలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోరులోని డి.ఎ.వి. కాలేజీలో చేరారు. అక్కడ సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలు చదివి పాండిత్యం సంపాదించారు. అనర్గళంగా ఆ భాషల్లో ఉపన్యసించేవారు.

కలకత్తా మహాసభలలో మునగాల రాజా శ్రీ రాజా నాయని రంగారావు బహద్దూర్ గారి పరిచయ భాగ్యం కలిగింది. వెంకయ్యగారి దేశభక్తినీ, పట్టుదలనూ కార్యదక్షతనూ గమనించిన రాజాగారు, వెంకయ్యగారిని మునగాలకు ఆహ్వానించి.. తీసుకువచ్చారు. అప్పటికే వెంకయ్యగారు వ్యవసాయ శాస్త్రంలో బాగా పరిశోధనలు వ్యవసాయ పరిశోధనశాలను ప్రారంభించి ఎంతో కృషి చేశారు. అమెరికా నుంచి కంబోడియా పత్తివిత్తనాలను తెప్పించి, పత్తిని పండించారు. మనదేశంలో సన్నని నూలును తయారుచేయడానికి అవసరమైన కంబోడియా పత్తిని ప్రప్రథమంగా పండించిన ఘనత వెంకయ్యగారికే దక్కుతుంది. వెంకయ్యగారి వ్యవసాయ పరిశోధనలనూ, వారి గ్రంథాన్ని పరిశీలించి బండన్లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీవారు వెంకయ్యగారికి -సొసైటీ సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. సువర్ణ పతకాలనూ, సర్టిఫికెట్లనూ బహూకరించారు. అదేకాలంలో (1907) వెంకయ్యగారు జాతీయపతాక ఆవశ్యకతను గుర్తించి కృషి ప్రారంభించారు.

బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో వెంకయ్యగారు 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా ఉన్నారు. జాతీయ కళాశాలలో ఉంటున్న కాలంలోనే (1916) వెంకయ్యగారు “భారతదేశానికి ఒక జాతీయపతాక” అనే పుస్తకం వ్రాశారు. బెజవాడ(ఇప్పటి విజయవాడ)లో 1921లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. గాంధీ మహాత్ముడు వెంకయ్యగారు జాతీయ పతాక విషయంలో చేస్తున్న కృషిని అప్పటికే బాగా ఎరిగి ఉన్నారు. అంచేత బాపూజీ వెంకయ్య గారిని ఆహ్వానించి జాతీయ పతాకం నమూనాను తయారుచేసి ఇమ్మని కోరారు. వెంకయ్యగారు ఆ నమునాను మూడురంగుల్లో మూడు గంటల్లో తయారుచేసి గాంధీజీ కి అందజేశారు. గాంధీ మహాత్ముడు ఎంతో సంతోషించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు సంఘంవారు 1921లో సమావేశమై ఈ పతాకమును కాంగ్రెసు పతాకముగా ఆమోదించారు. మనదేశం స్వతంత్రం పొందుతున్న తరుణంలో 22-7-1947 తేదీన భారత రాజ్యాంగ సభ సమావేశమై ఈ పతాకమును కొద్ది మార్పుతో జాతీయ పతాకముగా ఆమోదించింది.

అటువంటి నిష్కామ కర్మవీరుడు చివరి రోజుల్లో నానా అగచాట్లు పడ్డారు. విజయవాడలో డాక్టర్ కె.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతిరావు, జి.ఎస్. రాజు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, డాక్టర్ గూడూరు నమస్శివాయ మొదలైన వారు వెంకయ్య గారికి సన్మానం చేసి (15-1-1963) కొంత నిధిని వారికి అందచేశారు. 4-7-1963 తేదీన వెంకయ్యగారు కీర్తిశేషులయ్యారు.