News

ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!… పలువురు నేపాలీలు మృతి

235views

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. రష్యా ఆక్రమిత దొనెట ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో భారతీయుడు ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. మృతుడిని సూరత్కుఊ చెందిన హేమిల్ అశ్విన్ బాయ్ మంగు కియాగా గుర్తించారు. అతడు డిసెంబరు 2023లో రష్యాకు వెళ్లాడు. అక్కడ అతడిని సైన్యంలోకి పంపారు. హేమిల్ ను స్వదేశం తీసుకురావాలని కోరుతూ అతడి తండ్రి తరపున ఏజెంట్ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశాడు. దీనికి తోడు ఇప్పటికే అక్కడ చిక్కుకు పోయిన పలువురు భారతీయులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. హేమిల్ మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

మరోవైపు అదే యుద్ధంలో చిక్కుకుపోయిన కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల సమీర్ అహ్మద్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ దాడి జరిగిన రోజు ఓ డ్రోన్ ఎగరడాన్ని గమనించానన్నాడు. తనకు 150 మీటర్ల దూరంలో హేమిల్ తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతలో హఠాత్తుగా భారీ చప్పుడు వచ్చింద న్నాడు. ఆ సమయంలో తనతో సహా ఇద్దరు భారతీయులు, రష్యా సైనికులు కందకంలో దాక్కొన్నట్లు పేర్కొన్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి చూడగా హేమిల్ చనిపోయినట్లు తెలిసిందన్నాడు. కొందరి సాయంతో అతడి మృతదేహాన్ని ఓ ట్రక్కులోకి ఎక్కించానని వెల్లడించాడు. దాడిలో కొందరు నేపాలీలు కూడా చనిపోయినట్లు చెబుతున్నాడు. హేమిల్ మృతదేహాన్ని రెండు నెలల తర్వాత భారత్ కు అప్పగించే అవకాశం ఉందని రష్యా కమాండర్ తెలిపారు.