
అక్షరాస్యత బహు తక్కువగా ఉన్న కాలంలో భారతీయులలోకి స్వాతంత్ర్య పోరాట సందేశాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్ళి, పోరాటంలో కార్యోన్ముఖులను చేసిన సంపాదకుల సేవ వెలకట్టలేనిది.
గ్రామాలలో రచ్చబండ దగ్గర, ఒక విద్యావంతుడు బిగ్గరగా సంపాదకీయాలను చదువుతుంటే గ్రామస్తులంతా శ్రద్ధగా విని, సత్యాగ్రహులుగా, పోరాటవీరులుగా మారేవారు. తదుపరి ఉద్యమం ఏది, దానిని ఎలా నిర్వహించాలి అనే విషయం ప్రజలకు చేరవేసే వార్తలతోపాటుగా మార్గనిర్దేశనం చేసిన విశిష్ట సంపాదకీయాలు వ్రాసిన ఆ పెద్దల కలాలెంతో పదునైనవి. దేశ స్వాతంత్ర పోరాటంలో పత్రికలు వహించిన పాత్ర, అందులో సంపాదకులుగా వారు అందించిన ఉత్తేజం, సంపాదకీయాలు బాంబులు కన్నా అధిక శక్తితో పేలుతున్నాయని భయపడిన బ్రిటీష్ పాలనావ్యవస్థ గురించి స్మరించాల్సిన అవసరం ఉంది. తమ సంపాదకీయాలతో ప్రజలను ఉత్తేజపరచటం నేరంగా వలసపాలకులు కేసులు పెడితే కారాగార శిక్షలు అనుభవిస్తూనే. తమ భాషాభిమానం, అక్షరశక్తిని ప్రదర్శించిన త్యాగమూర్తులు పత్రికా సంపాదకులు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, ఇంగ్లీషు పత్రికలను నడిపిన ఆంధ్రసాహితీ సారథులు అనేక మంది ఉన్నారు.వారిలో ఒకరు ముట్నూరు కృష్ణారావు.
కృష్ణారావుగారి ఇంటి పేరు ముట్నూరి, ముట్నూరు గ్రామం కృష్ణానది ఒడ్డున దీని తాలూకాలో ఉన్నది. అది కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం వద్ద ఉండేది. శ్రీకాకుళం ఆంధ్రుల రాజధానిగా చిరకాలం ప్రతిష్ఠ నార్జించుకొన్నది. ముట్నూరు నదీప్రాంతమైన తర్వాత వీరి కుటుంబము రామన్నపేటలో స్థిరపడది. అక్కడినుండి బందరు శివగంగకు మారారు. ఈయన సునిశిత మేధావి. ఆంధ్రాంగ్ల భాషలలో అద్వితీయుడు. కృష్ణారావుగారు తాను ఎఫ్.ఏ. చదువుచుండగా బి.ఏ. విద్యార్థులకు విని, షేక్స్పియర్ బోధిస్తూ ఉండేవారు. ఒకనాడు నాయుడుగారు వారికి తెలియకుండానే ఈ బోధించడం ఒక గంట సేపు వినటం తటస్థించింది. వెంటనే వెళ్ళి కృష్ణారావును కౌగిలించుకొని “నాకంటే బాగా చెబుతున్నావోయ్” ‘ అని అభినందిస్తూ “నా శిష్యులు ఇటువంటి వారైనారని ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను” అన్నారు.
1900 నుండి 1920 వరకు భారత రాజకీయ రంగము లాల్, పాల్, బాల్ యుగమని చెప్పవచ్చు. మహా పండితుడు, శుద్ధశోత్రియుడు బాలగంగాధర తిలక్ శక్తితో మహారాష్ట్రుడు. ఆర్యసమాజికుడైన పంజాబీ లాలా లజపతిరాయ్. బ్రహ్మ సమాజికుడైన చాల్సిన బెంగాలీ బిపిన్ చంద్రపాల్. ఈ త్రయం వారి సర్వస్వమును దేశారాధనకై ధారవోసి అఖిల భారతవర్షాన్ని ఉత్తేజితులను చేయటానికి స్థిరసంకల్పులైన రోజులవి. 1906 వొస్తూనే కలకత్తా కాంగ్రెసులో దాదాభాయ్ నౌరోజీ నిర్వచించిన స్వరాజ్యం, జాతీయవిద్య, పత్రికా 1907లో సూరత్‌లో పైనాయకత్రయం పునశ్చరణ బందరు నాయకత్రయాన్ని సృష్టించింది. వారు కోపల్లె హనుమంతరావు, ఎమ్.ఎ.బి.ఎల్., డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఎమ్.బి..సి.ఎమ్., ముట్నూరి కృష్ణారావు గార్లు వీరి ముగ్గురిదీ ఒకే మాట, ఒకే బాట, ఒకే కార్యక్రమం. 1923లో హనుమంతరావు గారు స్వర్గస్థులయ్యే వరకు ఆంధ్రదేశంలో స్వరాజ్య సంరంభంలో కాని, స్వరాష్ట్ర సంపాదనలోని, బందరులోని జాతీయ కళాశాల నిర్వహణలో కాని, ఆంధ్రభాషాభివర్ధినీ సంఘ నిర్వహణలో కాని, కృష్ణాపత్రిక నిర్వహణలో కాని మరిఏ కార్యనిర్వహణనైనా ఒకే ఆలోచనతో చేయుచుండిరి. కృష్ణారావు గారు తత్వవేత్త, ఆధ్యాత్మికచింతనా తత్పరుడు.
కోపల్లె హనుమంతరావు గారిది కవిహృదయం. ఆయన త్యాగమూర్తి, పట్టాభిగారు లౌకిక వ్యవహారదక్షుడు, ఆర్థికవేత్త. వారే చెప్పుకున్నారు… కోపల్లె డ్రైవరు, భోగరాజు బ్రేకు గార్డు. ముట్నూరి ప్రయాణికుడు. వీరికి అన్ని విధాల సహాయకారి, సలహా సంప్రదింపులు ఇచ్చువారు వంగభాషలో పండితుడు, సంఘ సంస్కర్త, కళారాధకుడు, దేశభక్తుడు అగు శ్రీ కౌతా శ్రీరామశాస్త్రిగారు. వీరు సరస్వతీనికేతన్ అనే పేరుతో బెంగాలీ గ్రంథాలను అనువాదం చేసి ఆంధ్రభాషకు అమూల్య రత్నాలను చేకూర్చారు. కృష్ణారావు గారికి ఆంధ్ర, ఆంగ్లభాషల్లో అసమాన పాండిత్యం కలదు. అనర్గళంగా, గంభీరంగా ఉపన్యసించ కలిగినటువంటి వక్త మంచి రచయిత. స్వరాజ్య సంరంభానికి ప్రజలను ఆయత్తపరచుటకు తనకొక పత్రిక అవసరమని భావించారు. అదివరకే కృష్ణా మండలం సంఘం తరపున శ్రీ కొండా వెంకటప్పయ్య వంతులు, దాసు నారాయణరావు గార్ల సంయుక్త సంపాదకత్వంలో వెలువడుతున్న కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. తరువాత ఆ పత్రిక సంపాదకులైన తన సహచరుడు అవటపల్లి నారాయణరావు గారి సాహచర్యం వల్ల పటుతరముగ, భావగాంభీర్య ముట్టిపడునట్లుగా చక్కని గ్రాంథిక భాషలో భీరులను సైతం ధీరులుగా తయారుచేయగల శక్తి సంపన్నతగల వ్యాసములు
వ్రాయగల శైలి అలవరచుకున్నారు.
ఒక ఆరునెలలు బిపిన్ చంద్రపాలు వెంట బెంగాలులో పర్యటన మొనరించారు. వారితో ఆంధ్రదేశమంతా తిరిగారు. ప్రజా హృదయాన్ని ఆకర్షించగల శక్తి సంపన్నతను, లోకజ్ఞానమును సంపాదించుకొన్నారు. తరువాత కృష్ణాపత్రిక సంపాదకత్వం చేపట్టారు. పత్రికా సంపాదకత్వ మొక తపస్సుగా నిర్వహించారు. అట్టివారు నభూతో నభవిష్యతి. అట్టి వ్యాసాలను వ్రాయదగిన లేఖిని మరొకటి లేదు అనిపించుకొన్నారు. కృష్ణాపత్రికలో ప్రకటింపబడిన ఏ వాక్యమైనా, వార్తయైనా సత్యమే అనే పవిత్రభావం ప్రజలలో కలిగించారు. పత్రికాధిపతిగా స్వపర పక్షభేదం లేకుండా నిర్మొహమాటముగా విమర్శనా దృష్టితో పవిత్రభావములతో వ్రాయుటవారి నిత్యవిధిగా భావించారు. కృష్ణారావు గారిది గుండ్రనిముఖం, విశాలమైన వక్షస్థలం, దీర్ఘబాహువులు, బంగారువంటి మేనిఛాయ, చిరునవ్వు పెదవులమీదచిందుతూ ఉండేది. చాలా సుందర విగ్రహం. కిరీటం వంటి తెల్లని తలపాగు ధౌతవస్త్రాలు, ఆయన హృదయ స్వచ్ఛతకు నిదర్శనములా అనిపిస్తాయి.
అది పత్రికాఫీసు అనిపించదు. అది ఒక దర్బారు. శ్రీకృష్ణదేవరాయల దర్భారును జ్ఞాపకం చేసే శ్రీకృష్ణరాయ దర్బారు. ఈ దర్బారునకు హాజరయ్యే పెద్దలు పట్టాభి, కౌతా శ్రీరామశాస్త్రి, చిట్టా సుందరరామయ్య, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి కాటూరి వెంకటేశ్వరరావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, అడివి బాపిరాజు, కొడాలి ఆంజనేయులు, పింగళి నాగేంద్రరావు, కాకాని నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, వడ్లమన్నాటి రామారావు, తోట వెంకటేశ్వరరావు వగైరా చాలామంది కవులు, పండితులు, నటులు, కళారాధకులు, గానకళాకోవిదులు, రాజకీయ వేత్తలు, వివిధ విషయాలమీద చర్చలు సాగించేవారు. చర్చలను ప్రోత్సహించి జాగ్రత్తగా కృష్ణారావుగారు వింటూ ఉండేవారు. ఈ చర్చల పర్యవసానం సందర్భోచితంగా ఆ వారపు కృష్ణాపత్రికలో ప్రధాన వ్యాసంలో కాని, పన్నీటి జల్లులో కాని కానవచ్చేది.
1919లో పంజాబు వధలు జరిగినపుడు కృష్ణారావు గారు గ్రామాల వెంట కూడా పయనించి బ్రిటీష్ వారి పైశాచికత్వమును గురించి పిడుగులు పడేటట్లు ఉపన్యసించేవారు. ప్రజలను ఉద్రేకఉత్సాహాలతో రణరంగానికి దూకేటంత ధీరులుగా చేసేవారు. వారు ప్రచురించిన సంక్రాంతి సంచిక ఆయన కళా హృదయాన్ని, కళలలో ఆయన పాండిత్యాన్ని, అభిరుచిని తెలుపుతుంది. కృష్ణాపత్రికలో అప్పుడప్పుడు. వ్రాసిన “లోవెలుగులు” ఆయన వేదాంత ప్రవృత్తినీ, ఆయనకు వేదాంత శాస్త్రంలోగల పాండిత్యాన్ని విశదీకరిస్తాయి. ఒకానొక సందర్భంలో ఆయనను “ఆధ్యాత్మిక తేజస్వి” అని మహాత్ముడు ప్రశంసించాడు. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత తమ లేఖిని ద్వారా ప్రజలలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిన ఘనత శ్రీ క్రిష్ణారావు గారిది. ఆయన గొప్ప పత్రికా సంపాదకుడు, వక్త, వ్యాఖ్యాత, భాష్యకారుడు, శోధకుడు, సత్యాన్వేషి, కళావేత్త, తత్త్వవేత్త, ద్రష్ట, ఉపదేశకుడు, పత్రికా ప్రబోధంవల్లనే ప్రవర్తనవల్ల సైతం ఆయనను ఆచార్యునిగా ఆరాధించేవారు. ఆయన సహచరులూ, అనుచరులూ కూడ.





