
జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు గత నెల 31న ఇచ్చిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు శుక్రవారం అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఆరో తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు వారణాసి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షం తరఫున ఎస్.ఎఫ్.ఎ.నక్వీ వాదనలు వినిపించారు. పదవీ విరమణ రోజున హడావిడిగా పూజలు చేసుకొనేందుకు అనుమతిస్తూ జిల్లా న్యాయమూర్తి అజయ కృష్ణ విశ్వేశ్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. దీనిపై జస్టిస్ అగర్వాల్ స్పందిస్తూ…జనవరి 17న రిసీవర్‌గా జిల్లా మేజిస్ట్రేట్‌ను నియమించినపుడు ఎందుకు సవాల్ చేయలేదని నక్వీని ప్రశ్నించారు. దాన్ని సవాల్ చేయనపుడు జనవరి 31 ఉత్తర్వులపై అభ్యంతరం చెప్పలేరని అన్నారు. ఆ మేరకు పిటిషన్‌లో సవరణలు చేసుకొని రావాలని పేర్కొన్నారు. విచారణను వాయిదా వేశారు.
మరోవైపు హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వారణాసిలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బంద్ జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) లోక్‌సభ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ముందు ‘జ్ఞానవాపి మసీద్‌ను రక్షించండి’ ‘ప్రార్థనా స్థలాల చట్టాన్ని రక్షించండి’ అనే ప్లకార్డులతో నిరసన చేపట్టారు.





