ArticlesNews

కర్ణాటక సంగీత కుంభమేళా త్యాగరాజ ఆరాధనోత్సవాలు

344views

(జనవరి 26 – 30 వరకు 177వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు)

ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పుష్య మాసం బహుళ పంచమి రోజున ‘త్యాగరాజ స్వామి ఆరాధన’ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. త్యాగరాజు స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున ప్రతి ఏడాది ఘనంగా సంగీతోత్సవాలు జరుగుతాయి.

“సంగీత జ్ఞానము వినా.. సన్మార్గము గలదె మనసా” (దైవభక్తి లేని సంగీతం పరిమళం లేని పుష్పం వంటిది) అంటూ మానవాళికి బోధించిన శ్రీ త్యాగయ్య పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామానికి చెందినవారు. అనంతరం తమిళనాడుకు వలసవచ్చి స్థిరపడ్డారు. తంజావూరు జిల్లా తిరువారూరులో రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1767 మే 4న జన్మించారు త్యాగరాజు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం. తండ్రి రామబ్రహం తంజావూరు ప్రభువు శరభోజి రాజాస్థానంలో ఉద్యోగం చేసేవారు.

త్యాగయ్య బాల్యంలోనే తమ తాతగారైన కాళహస్తయ్యగారి దగ్గర వీణావాదనం నేర్చుకున్నారు. శొంఠి వెంకట రమణయ్యగారి శిష్యరికంలో శాస్త్రీయ సంగీతాన్ని పుక్కిటపట్టారు. వీరికి శ్రీరాముడంటే ఎనలేని భక్తి. వీరి భక్తి, సంగీతాలకు మెచ్చి నారదముని ‘స్వర్ణార్ణవం’ అనే గొప్ప సంగీత గ్రంథాన్ని ఇచ్చారు. నిరంతర రామనామ జపంతో, అనన్యసామాన్యమైన భక్తితో అనేక వేల కీర్తనలు రచించిన మహా వాగ్గేయకారుడు, ‘నాదబ్రహ్మ’ త్యాగయ్య. ఆయన అనేక కొత్త రాగాలను సృజించారు కూడా.

రాజ సత్కారాన్ని, ఆస్థానగౌరవాలను తిరస్కరించి నిధి కన్నా రాముని సన్నిధిమిన్న అని ప్రబోధించారు త్యాగయ్య. తన కృతులలో శ్రీరాముడిని కీర్తించడమేకాక మనం అలవరచుకోవలసిన సద్గుణాలను కూడా బోధించారు. వేలాదిమంది శిష్యప్రశిష్యుల ద్వారా శాస్త్రీయసంగీతాన్ని తరువాతి తరాలకు అందించారు. ఆ నాదయోగి తన 77న ఏట పుష్యబహుళ పంచమినాడు శ్రీరామునిలో ఐక్యమయ్యారు.

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఈయన జన్మదినం రోజుని భారతియ సంగీత దినొత్సవంగా జరుపుతాము. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి దగ్గర త్యాగరాజ మహోత్సవ సభలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

ఆయన భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి చెందింది.

ప్రతి సంవత్సరం ఆయన వర్థంతినాడు ఆయన శిష్యప్రశిష్యులు కావేరీ ఒడ్డున ఉన్న ఆయన సమాధి దగ్గర ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉన్నారు. గత 177 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల రోజున దేశంలోని కర్ణాటక సంగీత విద్యాంసులందరూ అక్కడకు వచ్చి త్యాగయ్య రచించిన ‘ఘనరాగ పంచరత్నాలు’ అని పేర్కొనే ఐదు కీర్తనలను గానం చేస్తారు.