
తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలిలో సినిమా షూటింగుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో శ్రీవారి భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీగా ఉండే ఉదయం వేళల్లో చిత్రీకరణ చేయడం, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను నిలిపివేయడంతోపాటు సినిమా యూనిట్‌కు చెందిన బౌన్సర్ల దురుసు ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తిరుపతిలో మంగళవారం జరిగింది. స్థానిక అలిపిరి గరుడ కూడలిలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌కు పోలీసులు అనుమతినిచ్చారు.

సాధారణంగా ఉదయం వేళల్లో ఈ కూడలి వద్ద రద్దీ వుంటుంది. వీఐపీ దర్శనాలకు వెళ్లేవారినుంచి వివిధ ప్రదేశాలనుంచి రైళ్లు, బస్సుల్లో వచ్చే భక్తులు కూడా తిరుపతి నుంచి తిరుమలకు ఆ సమయంలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌కోసం పోలీసులు.. భక్తుల వాహనాలను దారి మళ్లించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు వెళ్లాల్సిన భక్తులు సమయానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులతో, సినిమా యూనిట్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో యూనిట్‌కు చెందిన బౌన్సర్లు భక్తుల పట్ల, పరిస్థితిని చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ పట్ల దురుసుగా వ్యవహరించారు. ఓ కెమెరామెన్ సెల్‌ఫోన్ కూడా పగులగొట్టారు. పరిస్థితులు చేయిదాటిపోతుండడంతో షూటింగ్‌ను త్వరగా ముగించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మధ్యాహ్నం స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్ద జరిగిన షూటింగ్‌లో కూడా చిత్ర యూనిట్, బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దౌర్జన్యంగా వ్యవహరించడంతోపాటు బెదిరించడంతో మీడియా ప్రతినిధులు చిత్ర యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి భక్తులను నిలిపివేసి పవిత్ర స్థలంలో సినిమా షూటింగ్‌కు అనుమతినివ్వడంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. గరుడ కూడలిలో నిరసన ప్రదర్శనకు కూడా అనుమతి ఇవ్వని పోలీసులు.. ఏకంగా సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.




