News

దేవాలయాలపై రాజకీయ నాయకుల పెత్తనమెందుకు?

217views

రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయ నాయకులు, పాలనాధికారుల పెత్తనం ఉన్నంత వరకు దేవుడికి ధూపదీప నైవేద్యాలు కరవవుతాయని, పూజారులకు పస్తులు తప్పవని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అన్నారు. ‘భక్త చైతన్య యాత్ర’ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించి దేవాలయాల నిర్వహణకు పలు సూచనలు చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ వై.వి.ఎస్‌.మూర్తి ఆడిటోరియంలో ఆదివారం సూరంపూడి వీరభద్రరావు అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జొన్నవిత్తుల మాట్లాడుతూ.. దేవాలయాల్లో రాజకీయ జోక్యం తగదన్నారు. దేవాలయాలను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న అర్చకుల కంటే దేవాలయ మెట్లపై బిచ్చమెత్తుకునే యాచకుల సంపాదన ఎక్కువగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తితత్వాన్ని పెంపొందించేందుకు ‘భక్త చైతన్య యాత్ర’ చేస్తున్న వారి కృషి అసమానమైనదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. భాష, సంస్కృతి కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో విజయ నిర్మాణ్‌ సంస్థ అధినేత డాక్టర్‌ సూరపనేని విజయకుమార్‌, పద్య కవి వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలాంద ప్రసాద్‌, సంస్కృతాంధ్ర పండితుడు రంగాచార్యులు, సాహితీవేత్త నేమాని మంజునాథ శర్మ తదితరులు పాల్గొన్నారు.