News

సిద్దరామయ్యే సంక్షోభానికి కారకుడు – దేవెగౌడ.

98views

కర్ణాటకలో తలెత్తిన తాజా రాజకీయ సంక్షోభానికి సిద్దరామయ్యే కారణమంటున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ.  రాజీనామా లేఖలు సమర్పించిన 14 మంది కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య మద్దతుదారులేనని దేవెగౌడ ఆదివారంనాడు బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వెనుక సిద్ధరామయ్య ఉన్నారనే విషయం తనకు తెలుసునని, రాజీనామా చేసినవారంతా ఆయన మద్దతుదారులేనని దేవెగౌడ నిప్పులు చెరిగారు.

కాగా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా ఉన్న పేరున్న డీకే శివకుమార్ ఇవాళ దేవెగౌడను కలుసుకున్న సందర్భంగాలోనూ దేవెగౌడ ఇవే ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. కుమారస్వామి స్థానంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయాలని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు కోరుతున్నట్టు డీకే నేరుగా దేవెగౌడ దృష్టికి తెచ్చారని, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇదొక్కటే పరిష్కారమని ఆయన వివరించారని తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను దేవెగౌడ తోసిపుచ్చినట్టు సమాచారం. సిద్ధరామయ్యను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పట్టుబడితే జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకునేందుకు కూడా వెనుకాడదని ఆయన హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది.

అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా మల్లికార్జున ఖర్జే పేరు ప్రతిపాదనకు వస్తే పరిశీలించే అవకాశం లేకపోలేదని కూడా మధ్యమార్గంగా దేవెగౌడ సూచించినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య, దేవెగౌడ మధ్య శత్రుత్వం 2005లోనే మొదలైంది. దేవెగౌడ, కుమారస్వామిని సవాలు చేస్తూ అప్పట్లో జేడీఎస్‌కు సిద్ధారామయ్య ఉద్వాసన చెప్పారు. జేడీఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తానంటూ ప్రతినబూనిన సిద్ధరామయ్య ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.