News

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తుల సేవలో 700 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులు.

473views

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా వచ్చే భక్తుల సహాయార్ధం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, ఉత్కళ విపన్న సహాయతా సమితులు సంయుక్తంగా వివిధ సహాయక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాయి. రథయాత్ర సందర్భంగా షుమారు 700 మంది స్వయంసేవకులు 8 శ్రేణులుగా వివిధ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండడం గమనార్హం.

డాక్టర్ అంజన్ కుమార్ సాహూ, డాక్టర్ శుబ్రత్ కుమార్ మిశ్రాలతో కూడిన వైద్య బృందం ఇప్పటివరకు దాదాపు 458 మంది భక్తులకు తమ వైద్య సహకారాన్నందించారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా అందించారు. 5 మంది స్వయంసేవకులు వైద్యులకు సహాయకులుగా సేవలందిస్తుండగా, మరో 20 మంది స్వయంసేవకులు రోగుల స్నానాదికాలకు నీటిని అందించే పనిలో ఉన్నారు. ఇంకో 20 మంది భక్తులకు మంచి నీటి సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఆకస్మికంగా అనారోగ్యానికి గురయిన భక్తులను స్ట్రెచర్ లో తరలించే పనిలో ఓ 25 మంది స్వయంసేవకులు నిమగ్నమై ఉండగా, అంబులెన్సు నిర్వహణలో ఓ 8 మంది పాలు పంచుకుంటున్నారు. భక్తులకు దారి చూపడం, రోగుల వద్ద సహాయకులుగా ఇలా షుమారు 700 మంది స్వయంసేవకులు భక్తులకు అన్ని విధాలా తమ సహాయ సహకారాలందిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమాల ప్రారంభంలో ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ సునీల్ గోస్వామి, క్షేత్ర కార్యవాహ గోపాల్ ప్రసాద్ మహాపాత్ర, ఒరిస్సా పూర్వ ప్రాంత కార్యవాహ అనిల్ కుమార్ మిశ్రా, సహ ప్రాంత కార్యవాహ సుదర్శన్ దాస్, ప్రాంత ప్రచారక్ బిపిన్ ప్రసాద్ నందా, సహప్రాంత ప్రచారక్ శక్తిధర్ బిస్వాల్, ఉత్కళ విపన్న సహాయతా సమితి ఉపాధ్యక్షులు బిపిన్ బిహారీ పాండే తదితరులు పాల్గొన్నారు.

ఈ సేవా కార్యక్రమాల ప్రారంభోత్సవంలో చికిత్సా కార్యక్రమాలు, అంబులెన్సును KIIMS హాస్పిటల్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వనవిహారీ మిశ్రా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఉత్కళ విపన్న సహాయతా సమితి సంయుక్త కార్యదర్శి దివాకర్ ప్రసాద్ హరిచందన్ అతిధులను సభకు పరిచయం చేశారు. డాక్టర్ విజయ కుమార్ స్వైన్ ఈ సేవా కార్యక్రమాలలో భాగాస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ రుద్ర నారాయణ్ మహాపాత్ర ఈ మొత్తం సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.