News

అయోధ్యలో ఎటుచూసినా ఆధ్యాత్మిక కళ

280views

మరో నాలుగు రోజుల్లో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో అయోధ్య నగరం ఆధ్యాత్మిక కళను సంతరించుకొంది. రహదారుల ఫ్లైఓవర్ల మీదున్న వీధిదీపాలు శీరాముడు, విల్లంబులు, తిరునామాల దీపాలంకరణలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. లఖ్‌నవూ నుంచి అయోధ్యకు వెళ్లే హైవేకు ఇరువైపులా రామమందిర భారీ పోస్టర్లు వెలిశాయి. రహదారులపై పలుచోట్ల ‘శుభ తరుణం వచ్చింది.. రాముడి ప్రతిష్ఠ జరుగుతోంది’ (శుభ్‌ ఘడీ ఆయీ, విరాజే రామ్‌) నినాదాలు రాశారు. ఈ మార్గం పొడవునా ఉన్న హోటళ్లు, ధాబాలు భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ కాషాయ జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. ఫైజాబాద్‌ నుంచి అయోధ్య నగరంలోకి ప్రవేశించగానే ఎవరినైనా ఆధ్యాత్మిక భావన ఆవరిస్తుంది. ప్రధాన రహదారులుగా తీర్చిదిద్దిన రామ్‌పథ్‌, ధర్మ్‌పథ్‌ అయోధ్యకు అలంకారంగా మారాయి. సమీప ఆలయాల నుంచి స్పీకర్లలో ‘సియా రామ్‌’, ‘జై సియా రామ్‌’ అంటూ కీర్తనలు వినిపిస్తున్నాయి. పై రెండు రహదారులు లతా మంగేష్కర్‌ కూడలి వద్ద కలుస్తాయి.

సరయూ తీరంలో సైకతశిల్ప ప్రదర్శన

ప్రముఖ సైకతశిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్‌ పట్నాయక్‌ అయోధ్యలోని సరయూ తీరంలో జనవరి 22న సైకతశిల్ప ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. మరో ఏడుగురు సహ కళాకారులతో కలిసి ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరాముడు, రామచరిత మానస్‌ ఆధారంగా శిల్పాలు ఉంటాయని యూపీ ప్రభుత్వ లలితకళా అకాడమి సంచాలకులు డాక్టర్‌ శ్రద్ధా శుక్లా తెలిపారు. రాష్ట్రంలోని 40 మంది కళాకారులతో కుడ్యచిత్రాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

  • జనవరి 22న భక్తులకు పంపిణీ చేసేందుకుగాను శ్రీరాముడి చిత్రాలున్న 10 వేల ఫిరోజాబాద్‌ గాజులు గురువారం అయోధ్యకు చేరాయి.
  • రామమందిర దర్శనానికి వచ్చే భక్తుల కోసం బ్యాటరీ కార్లు సిద్ధం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఉచిత సేవలు అందిస్తారు. మార్చి నాటికి మొత్తం 650 బ్యాటరీ కార్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
  • అయోధ్య వేడుకను ‘చారిత్రక సందర్భం’ అంటూ బ్రిటన్‌లోని 200కు పైగా హిందూసంస్థలు గురువారం ఓ ప్రకటనలో స్వాగతించాయి.