
తిరుపతి జిల్లాలోని శేషాచలం కొండలు అనేక ప్రసిద్ధ తీర్థాలకు ప్రసిద్ధి. అటవీశాఖ అట్టహాసంగా ప్రకటించిన దశతీర్థ దర్శిని అడుగులు ముందుకుపడటం లేదు. సాక్షాత్తూ అటవీశాఖ మంత్రి ప్రయత్నాలు చేసినా నిధులు సమకూరకపోవడంతో ప్రాజెక్టు అటకెక్కినట్లు స్పష్టమవుతోంది.సాక్షాత్తూ తుంబుర, నారదులు వంటి దేవర్షులు సైతం ఇక్కడి తీర్థాల్లో స్నానమాచరించి తపస్సు చేసినట్లు భక్తులు విశ్వసిస్తారు. తిరుమల పరిధిలోనే 108 వరకు తీర్థాలు ఉన్నట్లు సమాచారం. వాటి ప్రాధాన్యతను అనుసరించి, నిర్దేశిత పౌర్ణమి రోజుల్లో కొన్నిటిని మాత్రమే భక్తులు దర్శించేలా టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం శేషాచలం పరిధిలోని పది తీర్థాలను ప్రతిరోజూ దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2022 సెప్టెంబరులో ఆదేశించారు. దట్టమైన అడవుల్లోని తీర్థాలను అటవీశాఖ భద్రత నడుమ చూడొచ్చని అందరూ ఉబలాటపడిపోయారు.
ప్రతిపాదనలు ఇలా..
మంత్రి ఆదేశాలతో అటవీశాఖ అధికారులు ఆగమేఘాల మీద ప్రతిపాదనలు పూర్తిచేశారు. ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశారు. తిరుమలలోని పాపనాశనం తీర్థం నుంచి ట్రెక్కింగ్ టూరుకు వీలు కల్పిస్తూ జాపాలి, సనకసనంద, చక్ర, నాగ, ధ్రువ, కుమారధార, పసుపుధార, రామకృష్ణ, తుంబర తీర్థాలను కలుపుతూ రూట్‌మ్యాప్ రూపొందించారు. పాపనాశనం తీర్థం సమీపంలో దుకాణాలు నిర్వహించే షికారీల్లో కొంతమందిని ఎంపిక చేసి, గైడ్లుగా తీర్చిదిద్ది వీరి నేతృత్వంలో తీర్థదర్శనం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అటవీశాఖ నిర్వహస్తున్న శేషాచలంవనదర్శిని.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు. తీర్థదర్శనం అనే ఆప్షన్‌తో ట్రెక్కింగ్ ట్రిప్‌ను పదిమంది కలిపి ఒక బృందంగా బుక్ చేసుకోవచ్చునని ప్రకటించారు. ఇలా రోజుకు పది బృందాలు తీర్థాలను దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూడునెలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, ప్రాజెక్టు అమల్లోకి తెస్తామని అధికారులు వెల్లడించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
శేషాచలం అడవుల్లోని తీర్థాలను ప్రత్యేక రోజుల్లో మాత్రమే చూడాల్సి ఉంటుంది. కొన్ని తీర్థాలను టిటిడి అటవీశాఖ నిర్వహిస్తున్నప్పటికీ చాలావరకు తీర్థాలను చూసే అవకాశమే ఉండదు. శేషాచలం పరిధిలోని పది తీర్థాలను అన్ని రోజులూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు 2022లో అటవీశాఖ అధికారులు ప్రకటించడంతో అందరూ స్వాగతించారు. అయితే రెండేళ్లు గడచిపోతున్నా ముందడుగు వేయలేకపోయారు.





