ArticlesNews

అర్చకులకు అక్కరకురాని ధూప దీప నైవేద్య పథకం

1.1kviews

దేవాలయాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధూప దీప నైవేద్యాల పథకం అరకొరగా అమలవుతోంది. దశాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు పూజారులు కొరవడటంతో ఆ ఆలయాలకు పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఈ ధూప దీప నైవేద్యం (డీడీఎన్‌) పథకం అర్చకులకు ఎంత మాత్రం ఉపయోగపడటం లేదు.

ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించి నైవేద్యం సమర్పించే అర్చకులకు డీడీఎన్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సమయానికి అందడంలేదు. దీంతో దేవుడి దీపానికి ధూపానికి కష్టంగా మారింది.ధూప దీప నైవేద్య అర్చకులను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం సరైన సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో అర్చకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలోని దేవాలయాల్లో నిత్యం దీపం ధూపం నైవేద్యం పెట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీడీఎన్‌ పథకాన్ని అమలులోకి తెచ్చారు. పురాతన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆలయాలు ఆర్థిక లేమి కారణంగా నిత్య పూజలకు నోచుకోకుండా ఉండకూడదని, అర్చకుల ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.

అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, ఆస్తిపాస్తులు లేని ఆలయాల్ని గుర్తించి కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత రాష్ట్రస్థాయిలో దరఖాస్తులు ఆహ్వానించి.. కొన్ని ఆలయాలను ఎంపిక చేశారు. అప్పట్లో ఒక్కో ఆలయానికి నెలకు రూ.2,500 చొప్పున అందజేశారు. అందులో అర్చకుల జీవన భృతికి రూ.1,500, మిగిలిన మొత్తం ధూప దీప నైవేద్యానికి వినియోగించేవారు. అయిదేళ్ల కిందట ఈ పథకానికి ఇచ్చే మొత్తాన్ని రూ.5 వేలకు పెంచారు. అందులో రూ.2,500 క్రతువులకు, అర్చకులకు గౌరవ వేతనంగా రూ.2,500 నిర్ణయించారు. దేవాదాయ శాఖ శ్రేయోనిధి నుంచి ఆలయాల అర్చకుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకం కింద అనేక ఆలయాలు ఉన్నాయి. ఎంపిక చేసిన దేవాలయాలకు డీడీఎన్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల గౌరవ వేతనాన్ని ధూప దీపంతో కలిపి రూ.10 వేలకు పెంచినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటికి దేవాలయాల్లోని అర్చకులు అరకొర ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధూప దీప నైవేద్యం (డీడీఎన్‌) పథకం కింద కేవలం రూ.5 వేలు మాత్రమే అందుతోంది. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో చాలా మంది అర్చకులు ఆర్థికంగా చితికిపోయారు. మరోవైపు నిత్యావసర సరకులు, ఇతర ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీడీఎన్‌ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచాలని ఎప్పటి నుంచో వారు కోరుతున్నా స్పందన లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరాదరణకు గురవుతున్న పురాతన ఆలయాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది. నామమాత్రంగా అమలు జరుగుతుండటంతో ఎన్నో ఆలయాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇతర మతాల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం హిందూ ఆలయాలపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ నిధులను ఇతర శాఖలకు మళ్లిస్తున్న ప్రభుత్వం ఆ శాఖను మాత్రం గాలికొదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ధూపదీప నైవేద్య పథకానికి నిధులను పెంచడంతో పాటు సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు. అంతేకాదు జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.