News

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుచ్చి కొత్త ఎయిర్​పోర్ట్

385views

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తమిళనాడు తిరుచ్చిలో అభివృద్ధి చేసిన ఎయిర్​పోర్ట్ టెర్మినల్ ఆకట్టుకుంటోంది. ప్రయాణికులకు ఆలయ గోపురం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఎయిర్​పోర్ట్​ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేశారు. నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

టెర్మినల్​ ప్రత్యేకతలు
తమిళనాడులో చెన్నై తర్వాత అతిపెద్ద ఎయిర్​పోర్ట్​గా తిరుచ్చి విమానాశ్రయానికి పేరుంది. ఈ నేపథ్యంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ నిర్మించారు. రూ.1100 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ నూతన టెర్మినల్​ ద్వారా ఏటా 44 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ఏకంగా 3,500 మంది వరకు ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని ఈ టెర్మినల్​ కలిగి ఉందని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

తిరుచిరాపల్లికి చెందిన సాంస్కృతిక చైతన్యం నుంచి ప్రేరణ పొంది కొత్త టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రసిద్ధ శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన కళారూపాలను ప్రతిబింబించేలా ఎయిర్​పోర్ట్​ గోపురాన్ని తీర్చిదిద్దారు. వీటితో పాటు భారత్​కు ప్రపంచంతో ఉన్న సంబంధాలను వర్ణింపజేసేలా అద్భుతమైన ఇంటీరియర్​ డిజైన్​ వర్క్​ను చేపట్టారు.