News

రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభాయాత్ర

344views

మాతృ భాషపై మమకారం పెంచుకుని ప్రతి ఒక్కరూ గౌరవించాలని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి పేర్కొన్నారు. అంతర్జాతీయ తెలుగు మహాసభల నేపథ్యంలో మంగళవారం రాజమహేంద్రవరం నగరంలో తెలుగు వైభవ శోభాయాత్రను నిర్వహించారు. యాత్ర కంబాల చెరువు దండి మార్చ్‌ సర్కిల్‌ నుంచి ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగు మాధుర్యం ప్రత్యేకమన్నారు.

నన్నయ మహాభారతాన్ని తెలుగులో రాసిన గడ్డపై ఈ మహాసభలు జరగడం గర్వకారణమన్నారు. ఎందరో మహాకవులు, పండితులు నడయాడిన నేల తెలుగు మహా సభలకు వేదిక కావడం సంతోషంగా ఉందని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు. చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ చైతన్యరాజు మాట్లాడుతూ తెలుగు మహాసభల కోసం గైట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్లమందికి పైగా తెలుగువారి పండగలా సభలు నిర్వహిస్తామన్నారు. మహా సభల నిర్వహణలో భాగంగా తితిదే వేద పండితుల ఆధ్వర్యంలో చతుర్వేద యజ్ఞం మొదలైందని ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ చెప్పారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు. యాత్ర కంబాలచెరువు, దేవీచౌక్‌, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్‌కు చేరుకుంది. రాజరాజనరేంద్రుడు విగ్రహం వద్ద రుడా ఛైర్మన్‌ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పుష్పాంజలి ఘటించారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షురాలు అనసూరి పద్మలత, వైకాపా యువనేత జక్కంపూడి గణేష్‌, చిన్నవెంకన్నబాబు స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.