ArticlesNews

అయోధ్య విమానాశ్రయ విశేషాలు

388views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య లో రామాలయ ప్రారంభోత్సం వేళ.. స్థానికంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం సకల హంగులతో ముస్తాబైంది. ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరుపెట్టిన దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో కేవలం 20 నెలల్లోనే పూర్తి చేసినట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) ఛైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. అయోధ్యలో ఏడాది పొడవునా తీర్థయాత్ర పర్యాటకాన్ని, వ్యాపారాలను ఈ విమానాశ్రయం సులభతరం చేస్తుందన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరిస్తామని ఓ వార్తాసంస్థకు తెలిపారు.

  • గతంలో 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను.. రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా ‘ఏఏఐ’ అభివృద్ధి చేసింది. ఇందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం 821 ఎకరాల స్థలం కేటాయించింది.
  • 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం నిర్మించారు. రద్దీ సమయాల్లో గరిష్ఠంగా 600 మంది ప్రయాణికులకు, ఏటా 10 లక్షల మందికి సేవలు అందించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
  • రన్‌వే పొడవు 2200 మీటర్లు. ఎయిర్‌బస్‌-321 విమానాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. రెండు లింక్ ‘టాక్సీవే’లతోపాటు ఎనిమిది విమానాలను పార్కింగ్ చేయడానికి అనువుగా స్థలం కేటాయించారు.
  • అయోధ్య చరిత్ర, విశిష్టతను దృష్టిలో ఉంచుకుని.. ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా పనులు చేపట్టారు. శ్రీరామ మందిర స్ఫూర్తితో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే కళాఖండాలు, పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో అలంకరించారు.
  • తొమ్మిది చెక్-ఇన్ కౌంటర్లు, మూడు కన్వేయర్ బెల్ట్‌లు (అరైవల్ హాల్‌లో రెండు, డిపార్చర్‌లో ఒకటి), ఐదు లగేజీ స్కానింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేశారు. కారు, బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు.
  • విమానాశ్రయంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్‌ఈడీ లైటింగ్, వర్షపు నీటి నిర్వహణ, 250 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్, తాగునీరు, మురుగు శుద్ధి ప్లాంట్‌ వంటివి ఏర్పాటు చేశారు. ఫౌంటెయిన్‌లతో కూడిన పచ్చదనం నిర్వహణకు రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తారు.
  • ఫేజ్‌-2లో భాగంగా 50 వేల చ.మీల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్‌ నిర్మాణానికి ప్రణాళిక. రద్దీ సమయాల్లో దాదాపు నాలుగు వేల మందికి, ఏటా 60 లక్షల మందికి సేవలు అందించేందుకు వీలుగా ప్రతిపాదించారు. ప్రస్తుతం 2200 మీటర్లుగా ఉన్న రన్‌వే.. 3750 మీటర్లకు పొడిగింపు. మరో ట్యాక్సీ వే, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పిస్తారు.