News

ఐబీకి కొత్త చీఫ్ అరవింద్, ‘రా’ డైరెక్టర్ గోయల్ – కేంద్రం కీలక నిర్ణయాలు.

575views

రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సామంత్ కుమార్ గోయల్, ఐబీ డైరెక్టర్‌గా అరవింద్ కుమార్‌లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇద్దరు అధికారులు 1984 బ్యాచ్‌కు చెందినవారే. గోయల్ పంజాబ్ క్యాడర్, అరవింద్ కుమార్ అసోం- మేఘాలయ క్యాడర్‌కు చెందినవారు. ప్రస్తుత రా, ఐబీ చీఫ్‌లు అనిల్ ధస్మానియా, రాజీవ్ జైన్‌ల పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. వారి స్థానంలో కొత్త అధికారులను కేంద్రం నియమించింది. వాస్తవానికి అనిల్, రాజీవ్ పదవీకాలం గతేడాది డిసెంబరు 31తో ముగిసినా కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. గోయల్ 2001 నుంచి ‘రా’లో కొనసాగుతుండగా, అరవింద్ కుమార్ 1991 నుంచి ఐబీలో సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం ‘రా’ విభాగంలో ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న గోయల్‌వైపే కేంద్రం మొగ్గుచూపింది.  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో గోయల్ కీలక పాత్ర పోషించారు.

ఐబీ డైరెక్టర్‌గా నియమితులైన అరవింద్ కుమార్ కశ్మీర్‌లో ఉగ్రవాదంతోపాటు వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలపై కీలక సమాచారాలు రాబట్టడంలో సఫలమయ్యారు. గోయల్ 2020 మేలోనూ, అరవింద్ వచ్చే సెప్టెంబరులో పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఇద్దర్నీ రెండేళ్ల కాలపరిమితికి నియమించారు. వీరిరువురూ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.