
నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన నాటి నుంచి 25, జూన్ 2019 మంగళవారం నాటికి నోట్ల చలామణీని 3.40 లక్షల కోట్ల (30408.68 బిలియన్ రూపాయల) మేర తగ్గించగలిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్ 8, 2016 న 500, 1000 రూపాయల నోట్లను ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసిన విషయం తెలిసిందే. నల్ల ధనం, దొంగ నోట్ల చలామణీని అరికట్టడం మరియు టెర్రరిస్టుల, మావోయిష్టుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం, సమాంతర ఆర్ధిక వ్యవస్థగా రూపొందుతున్న చట్ట వ్యతిరేక ఆర్ధిక వ్యవస్థను దెబ్బకొట్టే లక్ష్యంతో నోట్ల రద్దు నిర్ణయం చేసి డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ దిశగా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోందని కేంద్రం తెలియజేసింది.

కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
రాజ్యసభ సభ్యులు విశ్వంభర ప్రసాద్ నిషాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం నవంబర్ 4, 2016 లో 17.74 లక్షల కోట్లుగా ఉన్న ద్రవ్య చలామణీ 31 మే, 2019 నాటికి 21.71 లక్షల కోట్లకు పెరిగింది. కేంద్ర ఆర్ధిక మంత్రి వివరణ ప్రకారం ద్రవ్య చలామణీ ప్రతి ఏటా 14.51 శాతం పెరుగుదల నమోదు చేస్తుంది. ఆ ప్రకారం 31మే, 2019 నాటికి ద్రవ్య చెలామణీ 25.12 లక్షల కోట్లకు చేరుకోవాల్సివుండగా ప్రస్తుతం 21.71 లక్షల కోట్లు మాత్రమే వుంది. అంటే ద్రవ్య చలామణీ వృద్దిలో 3.95 లక్షల కోట్ల మేర తరుగుదల కనిపిస్తోంది.

MP విశ్వంభర ప్రసాద్
RBI నివేదికను ఉటంకిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి చేసిన ప్రకటన ప్రకారం బ్యాంకులు 2016 – 2017 ఆర్ధిక సంవత్సరంలో 7,62,072 నకిలీ నోట్లను గుర్తించగా, 2017 – 2018 వ సంవత్సరంలో 5,22,783 నకిలీ నోట్లను గుర్తించింది. 2018 – 2019 ఆర్ధిక సంవత్సరం నాటికి అది 3,17,389 నోట్లకు పడిపోయింది. ఇది నోట్ల రద్దు సాధించిన మరో విజయమని ఆమె తెలియజేశారు. టెర్రరిస్టుల, మావోయిష్టుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం ద్వారా దేశంలో హింసాత్మక సంఘటనలలో గుణాత్మకమైన తగ్గుదల కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. అంతే కాక 2016 లో 112.27 లక్షల కోట్లుగా వున్న డిజిటల్ లావాదేవీల విలువ 2018 సెప్టెంబర్ నాటికి 188.07 లక్షల కోట్లకు పెరిగినట్లుగాను, అదే విధంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య కూడా 98.83 కోట్ల నుండి 241.88 కోట్లకు పెరిగినట్లుగా ఆమె తెలియజేశారు.
Source : Swarajya.
https://m.ritam.app/Encyc/2019/6/26/Data-Reveals-Demonetisation-Has-Delivered-Big-On-Reducing-Cash-Increasing-Digitisation-Curbing-Counterfeit-Notes.amp.html





