News

మంత్రి సిఫార్సు లేఖతో బ్రేక్‌దర్శన టికెట్లు, రూ.వెయ్యి చొప్పున భక్తులకు విక్రయం

236views

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రేక్‌ దర్శనం టికెట్లను ఓ మంత్రి సిఫార్సు లేఖపై పొంది… వాటిని అధిక ధరలకు విక్రయించిన విషయం విజిలెన్స్‌ తనిఖీలో వెలుగు చూసింది. ఆలయంలో జరిగిన ఈ ఘటనపై విజిలెన్స్‌ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు కావాలంటూ ఓవ్యక్తి డిప్యూటీ ఈవో కార్యాలయ సిబ్బందిని సంప్రదించాడు. రాష్ట్రానికి చెందిన ఓమంత్రి సిఫార్సు లేఖతో ఒకేసారి 18 వీఐపీ టికెట్లు పొందాడు. డిప్యూటీ ఈవో కార్యాలయ సిబ్బంది అసలు ఈలేఖ నిజమా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే జారీచేసింది. సామాన్యులు టికెట్‌ కావాలంటే సంబంధిత వ్యక్తుల, సిఫార్సు చేసిన వ్యక్తుల గుర్తింపు కార్డులు టికెట్లు జారీ చేస్తారు. అలాంటిది ఒక లేఖ ఆధారంగా ఇన్నేసి టికెట్లు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్‌ పొందిన భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయంలోకి వెళ్లిన సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా విజిలెన్స్‌ ఐడీ పార్టీ గుర్తించింది.

భక్తులు పొంతనలేని సమాధానం చెప్పడంతో తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించడంతో అసలు విషయం వెలుగుచూసింది. మంత్రి సిఫార్సు లేఖపై టికెట్లు పొందిన వ్యక్తి వాటిని రూ.వెయ్యి చొప్పున తమకు విక్రయించినట్లు భక్తులు వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతించినా పెద్దసంఖ్యలో టికెట్లు పొంది, వాటిని విక్రయించిన దళారిని మాత్రం విజిలెన్స్‌ పట్టుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆలయంలో విధులు నిర్వహించే సూపరింటెండెంట్‌ తన సిఫార్సుపై నాలుగు బ్రేక్‌ టికెట్లు పొందినట్లు గుర్తించారు. దరఖాస్తు సమయంలో సిఫార్సు చేసిన వ్యక్తి గుర్తింపుకార్డు తప్పనిసరిగా జతచేయాల్సి ఉండగా… అటువంటిది ఏమీలేకుండా కేవలం సూపరింటెండెంట్‌ నోటిమాటతోనే కార్యాలయ సిబ్బంది భక్తులకు టికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు ఘటనలపై విజిలెన్స్‌ గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి డిప్యూటీ ఈవో కార్యాలయ సిబ్బందిని విచారించి టికెట్ల జారీ సమయంలో అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Sourece : ఈనాడు