News

నౌకాదళంలో చేరిన ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’

200views

భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్‌ గైడెడ్‌ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ (INS Imphal)’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరుగుతున్న వేళ.. మన దేశ రక్షణ సామర్థ్యానికి ఈ యుద్ధనౌక మరింత పదును పెట్టనుంది.

  • ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ పొడవు 163 మీటర్లు, బరువు 7,400 టన్నులు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ‘ఇంఫాల్ యుద్ధం’లో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా నౌకకు పేరు ఈ పెట్టారు. ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరును ఓ యుద్ధనౌకకు పెట్టడం ఇదే తొలిసారి.
  • భారత నౌకాదళానికి చెందిన ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ దేశీయంగా రూపొందించిన నాలుగు ‘విశాఖపట్నం’ క్లాస్ డెస్ట్రాయర్‌లలో ఇది మూడోది. ఈ యుద్ధనౌకను ముంబయిలోని మజగావ్‌ డాక్ లిమిటెడ్ నిర్మించింది.
  • 2017 మేలో ఈ యుద్ధనౌక నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2019 ఏప్రిల్‌లో జలప్రవేశం చేయించారు. 2023 ఏప్రిల్‌ 28 నుంచి పూర్తిస్థాయి ట్రయల్స్‌ నిర్వహించారు. ఆరు నెలల్లోనే అక్టోబరులో నౌకాదళానికి అప్పగించారు. నిర్మాణం, పరీక్షలను అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకున్న స్వదేశీ నౌక ఇదే కావడం విశేషం.
  • ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు, నౌకా విధ్వంసక అస్త్రాలు, టోర్పిడోలను ఈ యుద్ధనౌకలో మోహరిస్తారు. బ్రహ్మోస్‌ క్షిపణులూ ఇందులో ఉంటాయి.