
దత్తమాల ధరించి వచ్చిన భక్తులతో చిక్కమగళూరు జిల్లా మలెనాడు చంద్రద్రోణ పర్వత పరిధిలోని ‘కాఫీనాడు’ కాషాయమయమైంది. చిక్కమగళూరులో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగదళ మంగళవారం నిర్వహించిన శోభాయాత్రలో పాతిక వేలకుపైగా భక్తులు పాల్గొన్నారు. కామధేను గణపతి దేవాలయంలో దత్తాత్రేయునికి పూజ చేసి బసవనహళ్లి, హనుమంతప్ప కూడలి, ఎంజీ రోడ్డు మార్గాలలో కొనసాగిన యాత్ర ఆజాద్ కూడలిలో ముగిసింది. వీరభద్రుని వేషధారణతో వీరగాసె కళాకారులు కత్తి పట్టుకుని నృత్యాలు చేస్తూ ముందుకు కొనసాగారు. భజనలు చేస్తూ భక్తులు ముందడుగు వేశారు. పునీత్ రాజ్‌కుమార్ చిత్రాలతో కొందరు కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. మూడు వేల మంది పోలీసులను భద్రతకు వినియోగించారు. నాగేనహళ్లిలో దర్గా వద్ద దత్తజయంతిని ఆచరించేందుకు ప్రయత్నించిన శ్రీరామసేన నాయకుడు రంజిత్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. దర్గా చుట్టుపక్కల 144 సెక్షన్‌ను జారీలోకి తీసుకువచ్చారు. బాబాబుడాన్ గిరి గుహల్లోని దత్తాత్రేయ పాదుకలు దర్శించుకోవడానికి భక్తితో వేల మంది ముందుకు కదిలారు.




