News

తిరుమలలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

292views

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఈ రోజు ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.