
బ్రిటీష్ పాలనలో భారతదేశం రెండు శతాబ్దాల పాటు ఉంటే పోర్చుగీసువారు నాలుగున్నర శతాబ్దాలు కొనసాగారు. 1947 ఆగస్ట్ 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందినా, కొన్ని భాగాలు పోర్చుగీస్, ఫ్రెంచ్ పాలనలో మగ్గిపోయాయి. ఇందులో గోవా ఒకటి. గోవా ప్రజలు భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జన్ సంఘ్ కార్యకర్తలతో పాటు ఎందరో సత్యాగ్రహులు భాగస్వాములయ్యారు. 1961 డిసెంబర్ 19న భారతదేశంలో గోవా విలీనమైంది.
గోవాలో పోర్చుగీస్ పాలనకు, అణిచివేతకు వ్యతిరేకంగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 1946 జూన్ 18న తొలిసారిగా గొంతు విప్పారు. ఆయన ప్రేరణతోనే 1954లో ‘‘గోవా విమోచన సహాయక సమితి’’ ఏర్పడింది. ఈ సమితి సభ్యులు సత్యాగ్రహం, శాసనోల్లంఘన పాటిస్తూ ఉద్యమాన్ని నడిపించారు. అనంతరం గోవాను విముక్తి చేసేందుకు ‘‘ఆజాద్ గోమంత్ దళ్’’ అనే విప్లవ పార్టీ ప్రారంభం అయింది. విశ్వనాథ్ లవాండే, నారాయణ్ హరి నాయక్, దత్తాత్రేయ దేశ్ పాండే, ప్రభాకర్ సినారి కలిసి ఈ పార్టీని స్థాపించారు. గోవా విముక్తి కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహాయాన్ని సైతం ఆజాద్ గోమాంతక్ దళ్ తీసుకుంది. పూణేకు చెందిన మల్లయోధుడు నానా కాజ్రేకర్, బొంబాయికి చెందిన సంగీత దర్శకుడు, ప్రముఖ జాతీయ వాది సుధీర్ ఫడ్కేతో పాటు మరి కొందరు ‘‘యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్’’ అనే కూటమిని ఏర్పాటు చేసి గోవా విముక్తి కోసం పోరాడారు.
గోవాలో పోర్చుగీసు పాలన అంతం కావాలని ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చెయ్యాలని 1955లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరింది. ఈ విషయంలో సైనిక బలగాలను ఉపయోగించడానికి నెహ్రూ నిరాకరించడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితికి చెందిన కార్యకర్తలు.. జగన్నాథరావు జోషితో పాటు ఐదు వేల మందితో 1955 జూన్ 15న సత్యాగ్రహం ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు కూడా పాల్గొన్నారు. 1955 ఆగస్ట్ 15న పోలీసులు జరిపిన కాల్పులతో 50 మంది పౌరులు చనిపోయారు. అనేకులు తుపాకి గుండ్ల దెబ్బలు తిన్నారు. అనేక మంది పోర్చుగీసు జైళ్లలో అమానుష చిత్రహింసలను అనుభవించారు. గోవా రాజధాని పనాజీ సచివాలయం పై తొలిసారి త్రివర్ణ పతాకాన్ని స్వయం సేవక్ జగన్నాథరావు జోషి ఎగురవేశారు.
పుణే సంఘ్ చాలక్ వినాయక రావు అప్టే నేతృత్వంలో 1954న దాద్రా, నగార్ హవేలీలోకి వందమంది స్వయం సేవకులు చొరబడి సెల్వాసాలోని ప్రధాన పోలీసు కార్యాలయంపై దాడి చేసి అక్కడ 175 మంది సైనికులు బేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు. ఈ పోరాటమే గోవా విముక్తి దిశగా పలువురిలో స్ఫూర్తి నింపింది. అనంతరం కర్ణాటక కేసరిగా గుర్తింపు పొందిన జగన్నాథరావు జోషి నేతృత్వంలో గోవా సత్యాగ్రహం ప్రారంభం అయింది. ఈ సత్యాగ్రహంలో మధురకు చెందిన అమీర్ చంద్ గుప్తా మరణించారు. సరస్వతి ఆప్టే తాయి నేతృత్వంలో రాష్ట్రీయ సేవికా సమితి ఉద్యమంలో పాల్గొంది. సత్యాగ్రహులకు గోవా సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంది. ఈ పోరాటంలో రాజాభావు మహంకాళ్, సాగర్‌కు చెందిన సాహసి సహోదరా దేవి, సుభద్రా బాయి, కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన సూరి సీతారాం ఇలా ఎందరో ప్రాణత్యాగం చేశారు.
గోవాలో పోలీస్ చర్య తీసుకొని, విముక్తం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండో సర్ సంఘ్ చాలక్ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ విజ్ఞప్తి చేసినా నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు. 1961 నవంబర్‌లో పోర్చుగీస్ సైన్యం గోవా మత్స్యకారులపై కాల్పులు జరిపింది. దీంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గోవాను పోర్చుగీసు పాలన నుంచి విముక్తం చేసేందుకు నిర్ణయించక తప్పలేదు. ఇదే ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ ప్రారంభించిన 36 గంటల్లోనే పోర్చుగీసు ప్రభుత్వం లొంగిపోయింది. అలా భారతదేశంలో 451 ఏళ్ల పోర్చుగీసు పాలనకు 1961 డిసెంబర్ 19న తెర పడింది. గోవా విముక్త పోరాటంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తమ ప్రాణాలను త్యాగం చేసి మాతృభూమి పట్ల తమకున్న భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. భారతదేశ సార్వభౌమత్వం పరిరక్షణలో స్వయంసేవకుల త్యాగాలు మరువలేనివి.





