ArticlesNews

స్వదేశీ ఉద్యమంలో స్ఫూర్తి సంతకం బాబు గేనూ

262views

( డిసెంబర్ 12 – బాబూ గేనూ జయంతి )

కాశ్మీరీ లాల్, స్వదేశీ జాగరణ్ మంచ్

విదేశీ నిర్మిత వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాట కార్యకర్తలు నిర్వహించిన పలు నిరసనల్లో పాల్గొంటూ అహింసాయుత నిరసన కోసం బ్రిటిష్ వారిచే 22 ఏళ్ళ వయస్సులోనే హత్యకు గురైన ఈ మిల్లు కార్మికుడు బాబూ గేనూను దురదృష్టవశాత్తు నేటి ఆధునిక భారతదేశంలో జ్ఞాపకం చేసుకొనేవారు కరువయ్యారు.

నిజానికి, విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడిగా బాబు చెల్లించిన మూల్యం నేటికీ స్వదేశీ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. సుమారు శతాబ్దం తర్వాత భారత దేశ ఆర్థికాభివృద్ధికి అనువైన విధానాలకు అన్వేషణ జరుగుతున్న తరుణంలో దేశంకోసం బలిదానం చేసిన ఆ యువకుడి ఆలోచనలు స్ఫూర్తి కలిగిస్తున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ పాలన భౌగోళిక-వ్యూహాత్మక ప్రయోజనాలను బాబు అర్థం చేసుకున్నాడు. ఆర్ధికంగా ఆధిపత్యం వహించడమే బ్రిటిష్ పాలనకు చోదక శక్తి అని గ్రహించాడు.

బాబూ గేనూ సైద్ మహలుంగే పడ్వాల్‌లోని ఓ పేద రైతు కుటుంబంలో 1908లో జన్మించాడు, అతను ముంబైలోని ఒక పత్తి మిల్లులో కార్మికుడు. విదేశీ తయారీ వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య సమరయోధులు నిర్వహించిన నిరసనలలో చురుకుగా పాల్గొన్నాడు. బ్రిటీష్ రాజ్ స్థాపన అనేది భారతదేశంపై బ్రిటిష్ వారి ఆర్థిక ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడానికి ఒక ఎత్తుగడ మాత్రమే. ఈ సందర్భంలోనే గాంధీజీ ప్రతిపాదించిన సామాజిక-ఆర్థిక-రాజకీయ వాదనలు, వాటి ప్రాముఖ్యతను పాఠశాలలో చదువుకోనప్పటికీ బాబు జెనూ బాగా అర్థం చేసుకున్నారు.

బ్రిటీష్ పాలన ఆర్థికంగా నిలకడలేనిదిగా ఉంటే, భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనను కొనసాగించడానికి ఎటువంటి ప్రోత్సాహం లేక తనంతట తానే కూలిపోతుందని గ్రహించాడు. భారతదేశపు ఆర్థిక స్వాతంత్ర్యం రాజకీయ స్వాతంత్ర్యంతో ముడిపడి ఉందని, పెనవేసుకున్నదని, ఏకీకృతమైందని తెలుసుకున్నాడు.

ఈ గతిశీలతను అర్థం చేసుకుని, డిసెంబర్ 12, 1930న, బాబు, స్వాతంత్య్ర పోరాటంలో అతని సహచర కార్యకర్తలు ముంబైలోని కల్బాదేవి ప్రాంతం గుండా విదేశీ వస్త్రంతో ట్రక్కు రవాణా చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. మాంచెస్టర్‌కు చెందిన జార్జ్ ఫ్రేజియర్ అనే వస్త్ర వ్యాపారి, విదేశీ నిర్మిత దుస్తులను ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని పాత హనుమాన్ గల్లీలో గల తన దుకాణం నుంచి ముంబై పోర్టుకు పోలీసుల రక్షణతో తరలిస్తున్నాడు. నిరసనకారులు దానిని ముందుకు వెళ్లనీయవద్దని ప్రార్ధించినా, వినిపించుకోలేదు.

“వారు రోడ్డుపై సాష్టాంగపడి నిరసన తెలిపారు, ఒక ట్రక్కును వెళ్లనివ్వడానికి నిరాకరించారు. మధ్యాహ్నం జరిగిన ఖచ్చితమైన సంఘటనల గురించి భిన్నమైన కథనాలు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా పోలీసుల క్రూరత్వంతో జెనును ట్రక్కుతో ఢీకొట్టిన్నట్లు చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి” అని ది ఇండియన్ ఎక్సప్రెస్స్ కధనం వెల్లడి చేసింది.

అయితే, ఈ సంఘటనల మనోహరమైన దృశ్యాలు ఇంకా విషాదకరమైన క్రమాన్ని ప్రదర్శిస్తాయి. నిరసనకారులు బట్టల సరుకును తీసుకువెళుతున్న ట్రక్కు ముందు నిలబడ్డారు. కాని వెంటనే పోలీసు పార్టీ దానితో పాటు బలవంతంగా వారిని పక్కకు నెట్టారు. ఈ ఉద్యమంలో బాబు, అతని సహచరులు పాల్గొనకుండా పోలీసులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ, వారు అతని నిర్ణయంలో స్థిరంగా ఉన్నారు.

ట్రక్ డ్రైవర్ బల్బీర్ సింగ్ తోటి భారతీయు నిరసనకారులకు దగ్గరగా ట్రక్కును నడిపాడు. కానీ తన తోటి దేశస్థులపైకి దానిని తీసుకెళ్లాలనే ఉద్దేశ్యం అతనికి ఏమాత్రం లేదు.పోలీసులు మరోసారి రంగప్రవేశం చేసి నిరసనకారులను భౌతికంగా రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లి ట్రక్కును వెళ్లేందుకు అనుమతించారు.

అయితే, బాబూ గేనూ వారిని తప్పించుకొని, అహింసా నిరసనకు గుర్తుగా మరోసారి రోడ్డుపై పడుకుని, ట్రక్కును నడపవద్దని డ్రైవర్‌ను వేడుకున్నాడు. ఈ సందర్భంగా గాంధీజీని, స్వాతంత్ర్య ఉద్యమాన్ని కీర్తించాడు. పోలీసులు డ్రైవర్ బల్బీర్‌ను బాబుపై పరుగెత్తమని ఆదేశించినప్పుడు, అతను నిరాకరించాడు. “నేను భారతీయుడిని. అతను కూడా భారతీయుడే. కాబట్టి, మేమిద్దరం ఒకరికొకరు సోదరులం. అప్పుడు నేను నా సోదరుడిని ఎలా హత్య చేయగలను?” అంటూ నిసాహాయతను వ్యక్తం చేసాడు.

భారతీయ డ్రైవరు ఆలస్యము చేయడం చూసి బ్రిటిష్ సార్జెంట్ సహనం కోల్పోయాడు. తానే డ్రైవర్ సీటులోకి వెళ్లి బాబూ గేనూ మీదుగా పూర్తి వేగంతో ట్రక్కును నడిపి అతని తలను నుజ్జునుజ్జు చేసాడు. రక్తం, మాంసపు మడుగును విడిచిపెట్టాడు. బాబును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు.

ఆ తర్వాత ఆ ప్రాంతమంతా ఆగ్రవేశాలు వ్యాపించాయి. ముంబై నగరం అంతటా భారీ స్థాయిలో సమ్మెలు, నిరసనలు ప్రజ్వరిల్లాయి. బాబు హత్యకు వ్యతిరేకంగా కదిలి వచ్చారు. బ్రిటిష్ పాలకులకు తమ పాలనకు `ప్రమాద ఘడియలు’ వస్తున్నాయనే ఆందోళన మొదలైంది.

బాబు ఆత్మ త్యాగం ముంబై, పూణే, ఢిల్లీలో కూడా స్మరించబడ్డాయి. ముంబయిలో బాబూ గేనూ రోడ్డు ఉంది. అతని స్మారక చిహ్నం వీధి పక్కన ఉంది. నవీ ముంబైలో అతని పేరుతో ఒక మైదానం, పూణేలో చౌక్ కూడా ఉన్నాయి. అయితే, ఈ భాగాల చుట్టూ తిరిగే ఎవరినైనా అడగండి అసలు ఆ వ్యక్తి ఎవరో, అతను దేని కోసం నిలబడ్డాడో చాలామందికి తెలియకపోవడం దురదృష్టమే.

అయితే, అంతర్జాతీయ శక్తులు తమ ఆర్ధిక ప్రయోజనాలకోసం తమ అజెండాను ప్రపంచ ప్రజలపై రుద్దేనందుకు ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో బాబూ గేనూ ఆలోచనలు మన ప్రయోజనాలు కాపాడే విధానాలు రూపొందించుకొనేందుకు ఉత్సాహం కలిగిస్తాయి.