News

దొరికిన IAF విమానం AN -32 ఆచూకీ.

673views

8 రోజుల అవిశ్రాంత అన్వేషణ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోయల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్సు AN -32 విమానం ఆచూకీ లభ్యమైంది. ప్రయాణికులలో సజీవంగా ఉన్నవారిని రక్షించడానికి తొలుత ప్రాదాన్యమిస్తున్న రిస్క్యూ టీం ఆ దిశగా ముందుకు కదులుతోంది. రెండు హెలికాప్టర్ల ద్వారా తరలించిన 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని   విమాన ఆచూకీ లభించిన ప్రాంతంలో దించారు. వారిలో గరుడ కమాండోలు, పర్వతారోహకులు ఉన్నారు. విమానం పడిపోయినట్లుగా భావిస్తున్న ప్రాంతం భూ ఉపరితలానికి 12 వేల అడుగుల లోతులో ఉండడంతో రిస్క్యూ టీం అతి కష్టం మీద ముందుకు కదులుతోంది. వారు తప్పిపోయిన విమానంలో వెళ్ళిన 13మందిలో ఎవరైనా జీవించి ఉన్నారా? అన్న కోణంలో గాలిస్తున్నారు. వారి అన్వేషణ కోసం భారత అత్యాధునిక Mi17 విమానాలను, లైట్ హెలికాప్టర్లను వినియోగిస్తున్నది.

కాగా జూన్ నెల 3వ తారీఖున అస్సాం జోర్హాట్ బేస్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన AN -32 విమానం మిస్సయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఆరుగురు అధికారులతో సహా ఏడుగురు ఇతరులున్నారు. విమానం షియోమి జిల్లాలోని అడ్వాన్సుడు ల్యాండింగ్ గ్రౌండ్(ALG) వద్ద బయలుదేరిన ఒక గంట తర్వాత ల్యాండ్ కావాల్సి వుండగా బయలుదేరిన అర్ధగంట తర్వాత దానికి కింద ఉన్న సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయ్. విమానం పడిపోయినట్లుగా భావిస్తున్న కొండ ప్రాంతం కనిపెట్టడానికి వీలు లేనట్లుగా ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. చివరకు Mi – 17 ఛాపర్ విమానం తప్పిపోయిన విమానం జాడను కనిపెట్టింది.

తప్పిపోయిన AN 32  విమానంలో వింగ్ కమాండర్ GM చార్లెస్, స్క్వాడ్రన్ లీడర్ H వినోద్, ఫ్లైట్ లెఫ్టినంట్స్ మోహిత్ గార్గ్, సుమిత్ మొహంతి, ఆశిష్ తన్వర్ మరియు రాజేష్ తాపాలతో సహా వారంట్ ఆఫీసర్ KK మిశ్రా, సార్జంట్ అనూప్, కార్పోరల్ షరీన్, ఎయిర్ మన్ పంకజ్ సాంగ్వాన్, SK సింగ్, రాజేశ్ కుమార్, పుటాలి ఉన్నారు. వారందరూ క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులతో సహా దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.