
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వేలాది భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకుగానూ డేరాలతో ‘టెంట్ సిటీ’లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, అయోధ్య అభివృద్ధి ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడి మాజా గుప్తర్ ఘాట్, బాగ్ బిజేసీ, బ్రహ్మకుండ్ తదితర చోట్ల తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేలమందికి, బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి, బాగ్ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యం కల్పిస్తాం. కార్‌సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ తదితర చోట్ల కూడా ఇటువంటి వసతి ఏర్పాట్లు చేస్తాం’ అని వివరించారు.
శీతాకాలంలో ఈ వేడుక నిర్వహిస్తోన్న నేపథ్యంలో.. చలి బారినుంచి భక్తులకు ఉపశమనం కల్పించే విధంగా ఈ టెంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరుపులు, దుప్పట్ల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నారు. ఆహార నిల్వల ఏర్పాట్లు, వైద్య శిబిరాల వంటివీ ఉంటాయని చెప్పారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.





