News

హలాల్‌కు మతపరమైన కారణాల కంటె ఆర్థిక కారణాలే ప్రధానం

73views

రోజురోజుకూ పెరిగిపోతున్న హలాల్ బ్రాండింగ్‌ గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కేరళలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు హిందూ ఐక్యవేదిక ప్రకటించింది. హలాల్ ఉత్పత్తులు, సేవలను నిషేధించాలంటూ ఉన్నతాధికారులను డిమాండ్ చేయడానికి నిర్ణయించింది. వస్తువులు, సేవలను సైతం హలాల్ చేయడం వెనుక మతపరమైన కారణాల కంటె ఆర్థిక కారణాలే ఎక్కువగా ఉన్నాయని హిందూ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఆర్.వి బాబు అన్నారు. ఈ విధానం ఒక సామాజికవర్గంగుత్తాధిపత్యానికి కారణమవుతోందన్నారు.

‘‘హలాల్ చేసిన ఆహారాన్ని అందించే హోటళ్ళ పట్ల మాకు అభ్యంతరం లేదు. కానీ పరిస్థితులు ఏ దశకు చేరుకున్నాయంటే ఈ హలాల్ సర్టిఫికేషన్ వల్ల ముస్లిమేతరుల ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలకు ముప్పు వాటిల్లుతోంది’’ అని చెప్పారు. హలాల్ సర్టిఫికేషన్ కోసం, మూడోవంతు ఉద్యోగులు తప్పనిసరిగా ముస్లిములై ఉండడం తప్పనిసరి అని ఆయన వివరించారు.

‘‘వ్యాపారం పెరగాలంటే హలాల్ ఉత్పత్తులు అమ్మక తప్పని పరిస్థితికి వ్యాపారులను తెచ్చారు. దాన్ని వ్యతిరేకించేవారు సహజంగానే నష్టపోతారు. ఇప్పుడు ఇళ్ళ ఫ్లాట్లకు, ఆఖరికి ఆయుర్వేద ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేషన్‌ చేసేస్తున్నారు. నిజానికి ఇస్లాం ప్రకారం ఆయుర్వేదం అనేది హరామ్. కానీ, వ్యాపార ప్రయోజనాల కంటె ఏదీ ముఖ్యం కాదు కదా’’ అని వివరించారు.

హలాల్ పద్ధతి అనేదే వివక్షతో కూడుకున్నది, ఒకరకంగా అంటరానితనం లాంటిది అని ఆర్.వి బాబు వివరించారు. భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించిందని గుర్తుచేసారు. ‘‘ఇదంతా ఇటీవల కొన్నేళ్ళ నుంచీ మొదలైన పరిణామమే. 20ఏళ్ళ క్రితం లేని పద్ధతులన్నీ మనం ఈరోజు చూస్తున్నాం. ముస్లిమేతరులు తయారుచేసే ఆహార పదార్ధాలు హరామ్ అనే కొత్త విధానం తలెత్తింది. ఇది చివరికి సమాజంలో అశాంతిని, విభజనను రగులుస్తుంది. ఈ హలాల్-హరామ్ విధానం మతసామరస్యానికి భంగకరం’’ అని బాబు ఆవేదన వ్యక్తం చేసారు.

‘‘కేరళలో హలాల్ విధానం, పౌల్ట్రీ ఫార్మింగ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రజాజీవితాల్లోకి రావడం ప్రారంభమైంది. తర్వాత అది క్రమంగా హోటళ్ళు, రెస్టారెంట్లకు విస్తరించింది. దాన్నిబట్టే ఇదొక వ్యాపార వ్యూహమని అర్ధమవుతోంది’’ అని వివరించారు.

‘‘భారతదేశంలో హలాల్ సర్టిఫికెట్ జారీ చేసే జమియాత్ ఉలేమా ఎ హింద్ సంస్థ, తమ దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలుచేస్తుంది. ఆ డబ్బును జకాత్‌గా వసూలు చేస్తారు. అసలైన మెలిక ఇక్కడే ఉంది. ఆ వసూళ్ళ నుంచి కొంత మొత్తాన్ని కొన్ని కారణాలకు ఉపయోగిస్తారు. అవేమిటన్నదే అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉగ్రవాద నేరాల్లో నిందితులై ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నవారికి న్యాయసహాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఆ వివరాలన్నీ వారి వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉన్నాయి’’ అని బాబు వివరించారు.

ఇటీవలే, ఒక హోటల్లో హలాల్ బోర్డు తీసివేయమని అడిగినందుకు హిందూ ఐక్యవేదికకు చెందిన ఐదుగురు కార్యకర్తలను అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో హలాల్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు ముమ్మరంగా నిర్వహించడానికి వేదిక సిద్ధపడుతోంది.