News

ప్రపంచానికి పెను సవాలుగా ఇస్లామిక్ ఛాందసవాదం : ‘హిందూ జనరక్షకుడు శివాజీ’ రచయిత కేశవనాథ్

195views

ప్రముఖ రచయిత గజానన్ భాస్కర్ మహేందాలే రచించిన ‘సేవియర్ ఆఫ్ హిందూ ఇండియా’ పుస్తకాన్ని రచయిత కేశవనాథ్ తెలుగులోకి ‘హిందూ జనరక్షకుడు శివాజీ’ పేరటి అనువదించారు. ఈ అనువాద పుస్తకాన్ని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రామలింగారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైందవ మత సంరక్షకుడిగా నిలిచి ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని ఆప్ఘనిస్తాన్ వరకు విస్తరించారని గుర్తు చేశారు. శివాజీ పోరాట స్ఫూర్తితో హిందువులు ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. హిందువులు, హిందుత్వంపై జరుగుతున్న దాడులపై అప్రమత్తంగా వ్యవహరించి తిప్పికొట్టాలని సూచించారు.

శివాజీ పై చరిత్రకారులు మరింత అధ్యయనం చేయాలని శివచరితం పుస్తక రచయిత కేవీ. సుబ్రహ్మణ్యం తెలిపారు. నేటి పాఠ్య పుస్తకాల్లో ఛత్రపతి గురించి నామమాత్రంగా ఉండడం విచారకరమన్నారు. తంజావూరు పాలకుడిగా ఉన్న మహారాజా సర్వోజీ కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు. దేశ సాంస్కృతిక విలువలను కాపాడడంలో మరాఠా సామ్రాజ్యం విశేషంగా కృషి చేసిందన్నారు. శివాజీ ప్రేరణతో హిందూ సామ్రాజ్యాన్ని రాజా ఛత్రసాల్ వంటివారు విస్తరించారని తెలిపారు. మహారాష్ట్రీయులు తమ ప్రాంత రాజుల చరిత్రను భద్రపరిచారని వారిని స్ఫూర్తిగా మన తెలుగువారు తీసుకోవాలని సూచించారు.

అనంతరం పుస్తక అనువాద రచయిత కేశవనాథ్ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ రాజుగా ఆవిర్భవించిన నాటి నేపథ్యంతో పాటు జిజియా పన్ను, హిందువుల అణిచివేత, దాడుల వంటి ముస్లిం పాలకుల హేయమైన చర్యలను పుస్తకంలో సవివరంగా పొందుపరచడం అయిందన్నారు. రచయిత మహండాలే తన ‘ముందుమాట’లో ప్రస్తావించిన విధంగానే యావత్ ప్రపంచం ఇస్లామిక్ దాడులను ఎదుర్కొంటోందన్నారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడులే తాజా ఉదాహరణ అన్నారు.