NewsProgramms

“ఐసిస్” ప్రపంచ శాంతికి పెను సవాలు – వి. వి. ఆర్. కృష్ణంరాజు

356views

ప్రసంగిస్తున్న ముఖ్య వక్త శ్రీ వి.వి.కృష్ణంరాజు

ధునిక ప్రపంచానికి ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) తీవ్రవాదం ముప్పుగా మారిందని దీనిపట్ల భారత్ అప్రమత్తంగా వుండాలని ఆంద్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వి.వి.ఆర్ కృష్ణంరాజు అన్నారు. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాలులో 19/5/2019 ఆదివారం సాయంత్రం “భారత్ ప్రకాశన్ ట్రస్ట్” అధ్వర్యంలో “నారద జయంతి – జర్నలిస్ట్ డే ఉత్సవాలు” జరిగాయి. ఈ సందర్భంగా “ఐసిస్ – ప్రపంచ శాంతికి ముప్పు”  అనే అంశంపై శ్రీ కృష్ణంరాజు ప్రధానోపన్యాసం చేస్తూ ఐసిస్ దాడులలో ప్రపంచ వ్యాప్తంగా వేల మంది అమాయకులు బలవుతున్నారన్నారు. 1999లో ఐసిస్ ఊపిరి పోసుకున్నప్పుడు దానికి అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు సహకరించాయన్న ఆరోపణలున్నాయన్నారు. ఐసిస్ లక్ష్యం ప్రపంచమంతటా ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చెయ్యడమేనని, ఈ లక్ష్యంతో ఇస్లామిక్ తీవ్రవాదులు అమాయకులను ఊచకోత కోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడవ శతాబ్దంలో బ్రాహ్మణ రాజు దహీర్ సేన్ ఏలుబడిలో వుండిన భారత్ లోని సింధ్ ప్రాంతంపై మొట్టమొదట మహ్మద్ బీన్ ఖాసిం నాయకత్వంలో దాడి జరిగిందని, ప్రపంచంలో మొట్టమొదటి ఇస్లామిక్ దాడిగా దానిని అభివర్ణించవచ్చని పేర్కొన్నారు. ఐసిస్ కార్యకలాపాలపై భారత్ అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శ్రీ కృష్ణంరాజు హెచ్చరించారు.

ప్రసంగిస్తున్న అధ్యక్షులు శ్రీ ఎ. లక్ష్మీ కిస్మత్ కుమార్

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ డైరెక్టర్ శ్రీ ఎ. లక్ష్మి కిస్మత్ కుమార్ మాట్లాడుతూ పాత్రికేయ బ్రహ్మర్షిగా పేర్కొన దగిన శ్రీ జి. కృష్ణ గారితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తాను, జ్వాలా నరసింహారావు, గోవిందరాజు చక్రధర్, భండారు శ్రీనివాసరావు వంటి ఎందరో వారి శిష్య పరంపరలోని వారమేనన్నారు. పాత్రికేయులకు వాయిదా వేయడం( POSTPHONEMENT), సోమరితనం(LAZINESS), అహంకారం(ARROGANCE), నిర్లక్ష్యం(NEGLIGENCE) అనే ఈ నాలుగు దుర్గుణాలు వుండకూడదని వారు తరచూ చెప్పేవారని తెలిపారు.

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి శ్రీ కొసనం జగదీశ్ 

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విద్యాభారతి క్షేత్ర శారీరిక్ ప్రముఖ్ శ్రీ కొసనం జగదీశ్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, ధర్మాచరణ వంటి మానవాళికి అవసరమైన మంచి విషయాల వ్యాప్తికి నారదుడు కృషిచేశాడని తెలిపారు. ముంబైలోని ఒక పార్కులో బఠాణీలు అమ్ముకునే ఒక అబ్బాయి అక్కడే ఓ చెట్టు చాటున దేశంలో విద్రోహ చర్యలకు వ్యూహం పన్నుతున్న కొందరు ముష్కరులను గమనించి ఆ సమాచారాన్ని కొందరు ఆరెస్సెస్ కార్యకర్తలకు అందించగా వారు వెంటనే పోలీసులకు సమాచారమందించి వారిని పట్టుకునేలా చేయగలిగారని ముంబైలో జరిగిన ఒక సంఘటనను వారు వివరించారు. అవసరమైన సమాచార సేకరణ, వ్యాప్తి బాధ్యత కేవలం పాత్రికేయులది మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకోవాలని వారు తెలిపారు.

ప్రసంగిస్తున్న భారత్ ప్రకాశన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు

ప్రముఖ కాలమిస్టు, భారత్ ప్రకాశన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా స్వర్గీయ శ్రీరామశాయి ప్రతి ఏటా విజయవాడలో జరిగే నారద జయంతి కార్యక్రమాన్ని పర్యవేక్షించేవారని, ఈ ఏడు వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. భారత్ ప్రకాశన్ ట్రస్ట్ గత 11 సంవత్సరాలుగా ఉత్తమ పాత్రికేయులను గుర్తించి, గౌరవించి, సత్కరిస్తోందని ఇది భవిష్యత్తులో ఉత్తమ పాత్రికేయుల నిర్మాణానికి దోహదం చేస్తుందన్న భావనతోనే ఇదంతా చేస్తున్నామని తెలిపారు. సభికులందరూ రెండు నిముషాల మౌనం పాటించి స్వర్గీయ శ్రీరామశాయికి నివాళులర్పించారు.

సత్కారం అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వి.వి.కృష్ణంరాజు

ఈ సందర్భంగా ఉత్తమ సీనియర్ జర్నలిస్ట్ అవార్డు శ్రీ వి.వి.ఆర్ కృష్ణంరాజుకు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు సాక్షి దినపత్రిక అమరావతి బ్యూరో ఇంచార్జ్ శ్రీ మల్లు విశ్వనాథరెడ్డికి, ఉత్తమ టి.వి ఛానల్ జర్నలిస్ట్ అవార్డు ప్రైమ్ 9 టీవీ జర్నలిస్ట్ శ్రీ జరజాపు శేషగిరిరావుకు, ఉత్తమ సోషల్ మీడియా జర్నలిస్ట్ అవార్డు శ్రీ నిమ్మరాజు వెంకట చిరంజీవికి, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు శ్రీ నీలాపు సాంబశివరావుకు  అందజేశారు.

సత్కారం అందుకుంటున్న ఉత్తమ జర్నలిస్ట్ శ్రీ మల్లు విశ్వనాథ రెడ్డి

సత్కారం అందుకుంటున్న ఉత్తమ టీ.వీ. చానల్  జర్నలిస్ట్ శ్రీ జరజాపు శేషగిరిరావు

ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ శ్రీ సాంబశివరావు ప్రతిభా విశేషాలను వివరిస్తున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ శ్రీ శ్రీనివాసరెడ్డి  

సత్కారం అందుకుంటున్న ఉత్తమ ఫోటోగ్రాఫర్ శ్రీ నీలాపు సాంబశివరావు

సత్కారం అందుకుంటున్న ఉత్తమ సోషల్ మీడియా జర్నలిస్ట్ శ్రీ నిమ్మరాజు చిరంజీవి