NewsProgramms

శిలను చెక్కి శిల్పంగా మలచినట్లు… ఈ ప్రశిక్షణ – శ్రీమతి రత్నకుమారి

605views

విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లోజరిగిన రాష్ట్ర సేవికా సమితి (RSS మహిళా విభాగం) 15 రోజుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ప్రధాన వక్త, తెలంగాణ ప్రాంత కార్యవాహిక శ్రీమతి రత్న కుమారి మాట్లాడుతూ శిలలోని అనవసర భాగాన్ని తొలగిస్తేనే అది సుందరమైన శిల్పంగా మారుతుందని, అందుకు ఎంతో ఓర్పుగా ఉలి దెబ్బలను సహించవలసి ఉంటుందని, అలాగే మన బలహీనతల్ని తొలగించుకోవడం కోసం ఈ 15 రోజులు కఠినమైన శిక్షణను పొందామని తెలిపారు. శిల్పి శిల్పాన్ని చెక్కినట్లుగా శిక్షికలు మనల్ని చెక్కి, మనలోని బలహీనతలను దూరం చేసి ఉన్నత వ్యక్తులుగా రూపొందించారని, కఠోర పరిశ్రమ ద్వారానే సమాజంలో పూజ్యనీయమైన వ్యక్తులుగా నిర్మాణమవుతామని ఆమె పేర్కొన్నారు. కనకదుర్గ అమ్మవారి సంకల్పంతోనే సేవికలు ఈ శిక్షణకు రాగలిగారని ఆమె తెలిపారు.

హిందూ సమాజం బలహీనపడి, మతోన్మాద శక్తుల కబంద హస్తాలలో నలిగిపోతున్నపుడు శివాజీ తల్లి జిజియామాత తన కుమారుడు ధర్మ రక్షకుడు కావాలని సంకల్పించి ఆయనను మహా వీరుడిగా తీర్చిదిద్దిందని, నేడు కూడా కొన్ని కారణాల వల్ల పలుచబడ్డ హిందూ సాంస్కృతిక ధారను బలోపేతం చెయ్యడానికి ప్రతి మాతృమూర్తి జిజియామాతలా సంకల్పించాలని చెప్పారు. తల్లులు శిశువులను ఆ విధంగా తీర్చిదిద్దాలన్నారు.

విశ్వ శాంతిని కాంక్షించినది హిందూ ధర్మం మాత్రమేనని, నేడు హిందూ సంస్కృతికి విశ్వ మాన్యత లభిస్తున్నదని, యావత్ ప్రపంచం మన యోగాని, మన కుటుంబ వ్యవస్థను, మన తులసిని ఆదరిస్తూ అనుసరిస్తుండటమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీమతి మల్లిక మాట్లాడుతూ శిక్షణ ద్వారా ఒక పనిని మరింత తక్కువ సమయంలో, మరింత నైపుణ్యంతో చెయ్యగలుగుతామని, అటువంటి కార్యదీక్ష, దక్షత ఈ శిక్షణ ద్వారా సేవికలకు లభిస్తున్నదని పేర్కొన్నారు.

మరో ముఖ్య అతిధి డాక్టర్ కృష్ణకుమారి మాట్లాడుతూ హిందూ ధర్మంలో స్త్రీని ఎప్పుడూ తక్కువగా చూడలేదని, స్త్రీకి హిందూ సమాజం ఎప్పుడూ సమున్నత స్థానాన్నే ఇచ్చిందని తెలిపారు. విదేశీ, విధర్మీయ దాడుల నేపధ్యంలో తమ స్త్రీలకు అవమానం జరగకూడదన్న భావనతోనే స్త్రీలపై కొన్ని ఆంక్షలు విధించారని తెలిపారు. అయితే నేటి యువత స్వేచ్ఛ పేరుతో అన్ని హద్దులనూ చెరిపేసుకుంటున్నారని, తాబేలు స్వేచ్ఛ కోసం తన కవచాన్ని తొలగించుకుంటే ఎలా వుంటుందో స్త్రీ స్వేచ్ఛ పేరుతో కట్టుబాట్లను ఛేదించుకుంటే కూడా అలాగే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

యోగాసన్, దండ(కర్ర సాము), నియుద్ధ(కరాటే), యోగచాప్ తదితర అంశాలలో, శిక్షణ పొందిన సేవికల ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్ర ప్రాంతంలోని 4 విభాగ్ లు, 12 జిల్లాలలోని 26 స్థానాల నుంచి 56 మంది శిక్షార్ధులు, ఆరుగురు శిక్షికలు, ముగ్గురు ప్రబంధికలు పాల్గొన్నారని, మానసిక శిక్షణలో భాగంగా భారతదేశ వాస్తవ చరిత్ర, వైజ్ఞానిక పరంపర, భారతీయ కుటుంబ వ్యవస్థ విశిష్టత, హిందూ జీవన విధానము మొదలగు అంశాలలో మార్గదర్శనం చేయడానికి అఖిల భారత ప్రముఖ కార్యవాహిక మాననీయ సీతా గాయత్రి, మరి కొందరు కేంద్ర, క్షేత్ర, ప్రాంత అధికారులు విచ్చేశారని ఆంద్ర ప్రాంత కార్యవాహిక శ్రీమతి వెంకట భాను తమనివేదికలో వెల్లడించారు.