News

కెనడాలో హిందువులకు బెదిరింపులు ఆందోళనకరమన్న చంద్ర ఆర్య

297views

కెనడా- భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ .. నిషేధిత సంస్థలకు చెందిన నేతల బెదిరింపు ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్‌ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఖలిస్థానీ వ్యతిరేక శక్తులకు కెనడాలో చోటు లేదన్నాడు. ఇలా పన్నూ బెదిరింపులపై కెనడాలో హిందూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ బెదిరింపులు ఆందోళనకరం..

కెనడాలో హిందువులపై బెదిరింపులకు పాల్పడటంపై అధికార పార్టీ సభ్యులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకోవడంపై అధికార పార్టీ చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా దాడులతో హిందూ కెనడియన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇటువంటి సమయంలో సంయమనంతో ఉండాలని కెనడా హిందువులకు విజ్ఞప్తి చేశారు.