
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర సాయుధ బలగాలతో పాటు NDRF సిబ్బందికి అందించే భోజనంలో తృణధాన్యాలను చేర్చనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. సిబ్బంది తీసుకునే ఆహారంలో 30% మేర తృణ ధాన్యాల వంటకాలు ఉండేలా చూడనుంది. కేంద్రహోంమంత్రి అమిత్ళషా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. “సీఏపీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మీల్స్ లో 30% మేర తృణధాన్యాలు ఉండేలా చూడాలని కేంద్రమంత్రి అమిత్ షా సూచించారు. ఆ సూచన మేరకు ఇకపై ఈ నిర్ణయం అమలవుతుంది” అని
కేంద్రహోం శాఖ తెలిపింది.
ఇప్పటికే తృణ ధాన్యాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. వీటి ప్రాధాన్యత అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లోనూ వీటికి తగిన ప్రాధాన్యతనిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా తృణ ధాన్యాలకు ప్రయారిటీ ఇచ్చింది. ఈ మేరకు 2023-24ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ ధాన్యాల్లో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ గ్రెయిన్ అని పిలుస్తారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. రోజువారీ మీల్స్ లో మిలెట్స్ ను చేర్చనున్నట్టు వెల్లడించింది. సైనికులకు నెలవారీ ఇచ్చే రేషన్లోనూ మిలెట్ స్ను చేర్చనున్నారు. సైనికులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
“ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా…ఆర్మీకి అందించే మీల్స్ లో మిలెట్స్ను చేర్చుతున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన తృణధాన్యాలను వాళ్లకు అందించాలన్నదే మా లక్ష్యం. ఆరోగ్య పరంగా కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అన్ని ర్యాంకుల అధికారుల మీల్స్ లో వీటిని చేర్చాం”
అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.