
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో తనకి తీవ్ర అవమానం జరిగిందని సింహాచలం గిరిజన పాలకవర్గ సభ్యురాలు పంచాడి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన మహిళను అయిన తాను దర్శనానికి కుటుంబ సమేతంగా వస్తే పోలీసులు విచక్షణారహితంగా చేతులు వేసి తోసివేశారని తెలిపారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి తనపై చేయి వేసిన పోలీసులపై చర్యలు తీసుకుని క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. తనపై పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. తక్కువ కులానికి చెందిన దానిని కాబట్టే తనపై ఇలా ప్రవర్తించి ఉంటారని అనుకుంటున్నానని అన్నారు. పాలక మండల సభ్యురాలైన తాను సామాన్య భక్తురాలిలా దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. దేవస్థానం పాలకమండలి సభ్యురాలైన తనపై ఇలా ప్రవర్తిస్తే సామాన్య భక్తులు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. దేవస్థానం అధికారులను పక్కనపెట్టి పోలీస్ ఉన్నతాధికారులు ఇష్టానుసారం ప్రవర్తించారని పంచాడి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.





