
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్దానంలో జరుగుతున్న ఛైత్రమాస బ్రహ్మోత్సవాలలో మంగళవారం గంగ, దుర్గ, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ముందుకు సాగుతుండగా, సింహావాహన సేవ ఆద్యంతం భక్తి ప్రపత్తులతో కొనసాగించింది. ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ కర్నాటి రాంబాబు,సభ్యులు బుద్దా రాంబాబు, బచ్చుమాధవీకృష్ణ , స్దానాచార్యుడు శివప్రసాదశర్మ, ముఖ్క అర్చకుడు శ్రీనివాసశాస్త్రి ఈఈ రమాదేవి, ఏఈవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపు బ్రాహ్మణవీధిగుండా వెళ్ళి మెయిన్ రోడ్డు మీదుగా సాగింది.
ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రేపు
ప్రతినెలా పౌర్ణమి నాడు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న గిరిప్రదక్షిణలో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని 6వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఈవో భ్రమరాంబ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఘాట్‌రోడ్డులోని టోల్‌గేట్ నుంచి గిరి ప్రదక్షిణ ఊరేగింపు బయలుదేరుతుందని, ఏడు కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ సాగి ఉదయం 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. ఆలయంలో జరుగుతున్న చైత్రమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సదస్యం, వేద స్వస్తి, వేడపండితుల ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. ఈవో భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.





