News

కాళభైరవేశ్వరస్వామి కోనేరులో పడి ముగ్గురు బాలికల మృతి

187views

అందరూ కాటేరమ్మ గుడి వద్ద భక్తి శ్రద్ధలతో పూజల్లో నిమగ్నమయ్యారు. ముగ్గురు బాలికలు మాత్రం సరదాగా కాళభైరవేశ్వర స్వామి కోనేరు వద్దకు వచ్చారు. కాలుజారి కోనేరులో పడిన వీరు నీటమునిగి అసువులు బాశారు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మృతులంతా బంధువులే. అయ్యో.. దేవుడా, పూజలకని వస్తే ఇలా జరిగిందేంటయ్యా అంటూ కుటుంబీకులు విలపిస్తున్నారు. ఇంతటి విషాదానికి చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం తీర్థం-కోట్రేపల్లె సమీపంలోని కాళభైరవేశ్వరస్వామి ఆలయ కోనేరు కారణమైంది. కాళభైరవేశ్వరస్వామి ఆలయ సమీపంలోని కాటేరమ్మ గుడి వద్ద మంగళవారం పూజలు నిర్వహించడానికి దేవదొడ్డి గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు వెళ్లారు. కదిరప్ప బంధువులైన.. తమిళనాడు రాష్ట్రం అరట్లకు చెందిన సుబ్రమణ్యం కుమార్తె భవ్య, మణిమేఘల కుమార్తె మౌనిక కూడా ఈ పూజా కార్యక్రమానికి గాను దేవదొడ్డికి వచ్చారు. కదిరప్ప కుటుంబంతో కలిసి వీరూ కాటేరమ్మ గుడివద్దకు వెళ్లారు. పెద్దలంతా పూజల్లో ఉండగా.. కదిరప్ప కుమార్తె గౌతమి.. ఆమెకు అత్త కూతుర్లయిన భవ్య, మౌనిక కలిసి కాళభైరవేశ్వరస్వామి కోనేరు వద్దకు వచ్చారు. ముగ్గురూ ఒక్కసారిగా కోనేరులో దిగడంతో కాలుజారి పడిపోయారు. దీనిని గమనించిన కొందరు పిల్లలు వెంటనే పెద్దలకు తెలియజేసి.. వాళ్లు వచ్చేలోపే ఆ ముగ్గురూ నీట మునిగి మృతిచెందారు. దైవదర్శనానికి వచ్చిన తమ పిల్లలను ఆ దేవుడు తన వద్దకు తీసుకెళ్లిపోయాడంటూ కుటుంబీకులు రోదించారు. ఈ ఘటన జరిగిన వెంటనే భవ్య, మౌనిక మృతదేహాలను వారి కుటుంబీకులు అరట్లకు తీసుకెళ్లిపోయారు. బైరెడ్డిపల్లె ఎంఈవో సాయిలీల, ఉపాధ్యాయులు దేవదొడ్డికి వెళ్లి గౌతమి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించారు. ఎంతో భవిష్యత్తున్న ముగ్గురు విద్యార్థినులు అకాలమృత్యువుకు గురికావడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మృతులు: గౌతమి(13), భవ్య(17), మౌనిక(13). వీరిలో గౌతమి 7వ తరగతి.. భవ్య ఇంటర్‌, మౌనిక 8వతరగతి చదువుతోంది.

కోనేరు చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలి
కాళభైరవేశ్వరస్వామి ఆలయ కోనేరు చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలని పలువురు కోరుతున్నారు. పురాతనమైన ఈ కోనేరును ప్రస్తుతం ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం కోనేరు చుట్టూ పిట్టగోడ కానీ.. ఫెన్సింగ్‌గానీ లేకపోవడంతో స్విమ్మింగ్‌పూల్‌లా కనిపిస్తోంది. దీంతో ఈ కోనేరును చూసి పిల్లలు ఆకర్షితులై లోపలకు దిగడంతో ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కోనేరుచుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.