News

వేద సంరక్షకుడి నాభిని తాకిన సూర్య కిరణాలు

183views

చిత్తూరు జిల్లాలో సూర్యపూజ ఉత్సవాల్లో భాగంగా సూర్య కిరణాలు మత్స్యావతార మూర్తి నాభిని తాకాయి. నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సూర్య కిరణాలు ద్వార గోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, రాజ గోపురాలను తాకుతూ వేద సంరక్షకుడి నాభిని తాకాయి.భక్తుల గోవింద నామస్మరణల నడుమ సూర్యకిరణాలు ప్రవేశించిన మార్గంలో ఆలయ పరిచారకులు పుణ్య జలాన్ని చిలకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణస్వామి ఉత్సవర్లను తిరుచ్చిపై పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి తెప్పోత్సవం నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవార్లను ముత్యపు పందిరి వాహనంపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ తిరుచ్చిపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు.ఆలయ అర్చకులు నాగరాజ భట్టాచార్యులు, దేవరాజ భట్టాచార్యులు, దురైరాజ భట్టాచార్యులు ఆలయంలోని పరివార దేవతా మూర్తులకు ఉదయం అభిషేకాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం ఉత్సవర్లకు స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. రాత్రి తిరువీధి ఉత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఏకాంత సేవ జరిపారు.