
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపచారాలు ఆగడంలేదు. ఆలయంలో తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ య్యూటూబ్ చానల్‌లో ఏకంగా స్వామివారి గర్భాలయ గోడలపై ఉన్న పురాతన శాసనాలను పోస్ట్ చేయడం ముక్కంటి భక్తులను కలవరపరుస్తోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏడాదికాలం నుంచి దుమారాలు రేగడం షరామాములైపోయింది.నెలరోజుల క్రితం ప్రముఖ గాయని మంగ్లీ ఆలయంలో ఆటపాటలతో చిందేసింది.మాధన్న ప్రతిష్టిత లింగాన్ని అభిషేకించడం, పుష్పార్చన చేయడం, ఊంజల్‌సేవ మండపంలో ఆడిపాడడం, రాయలవారి మండపంలో రాతంత్రా వీడియోలు తెరకెక్కించడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదం సద్దమణగక ముందే సోమవారం తాజా సంచలనం వెలుగుచూసింది. ఓ మహిళ తన యూట్యూబ్ చానల్‌లో శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం అనే అంశంపై కొద్దిరోజులుగా సీరియల్‌గా ఎపిసోడ్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఎపిసోడ్ 34 పేరుతో సోమవారం కొత్త ఎపిసోడ్‌ను విడుదల చేసింది. 13.05నిమిషాల నిడివి వున్న ఆ వీడియోలో శ్రీకాళహస్తీశ్వరాలయంలోని స్వామివారి గర్భాలయ గోడలపై ఉన్న పురాతన శాసనాలను వీడియోలో చిత్రీకరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆలయ మహాద్వారం దాటి లోపలకు సెల్‌ఫోన్లను కూడా అనుమతించేది లేదని ఆరునెలల క్రితం కఠిన ఆంక్షలు విధించారు. అయితే ఏకంగా గర్భగుడి పక్కన ఉన్న ప్రదేశాన్ని కోస్టం అంటారు. ఇక్కడి గోడలపై చాలా సేపు అత్యంత నాణ్యవంతంగా వీడియోలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గర్భాలయం పక్కనే ఉన్న కోస్టం ప్రదేశంతో పాటు రాహుకేతు మండపంలో కూడా చిత్రీకరణ సాగింది.ఈ విషయమై ఆలయ ఈవో సాగర్‌బాబు మాట్లాడుతూ గర్భగుడి గోడలపై శాసనాల చిత్రీకరణ వీడియోలను పరిశీలించి విచారణ జరిపిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.




