News

కదిరి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే

251views

కదిరి వసంత వల్లభుడు, నాలుగు గోపురాల నారసింహుడు, కోనేటి రాయుడు, ఖాద్రీశుడు, కాటమరాయుడు… ఇలా వివిధ రకాల నామాలతో కదిరి లక్ష్మీనరసింహస్వామి కోరి కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నారు. భక్తుల నమ్మకం, విశ్వాసంతో విరాజిల్లుతున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఫాల్గునమాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగానే ఫిబ్రవరి రెండో తేదీ గురువారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. దాదాపు పక్షం రోజుల పాటు జరిగే నారసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ రాషా్ట్రల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంగా నిలిచే బ్రహ్మ రథోత్సవం(తేరు) మార్చి 13వ తేదీన జరగనుంది. పక్షం రోజుల పాటు ఖాద్రీశుడు వివిధ అవతరాల్లో దర్శనమిస్తారు. ఏడాదిలో అన్నిరోజులు ఆలయంలో మాత్రమే దర్శనమిచ్చే శ్రీవారు భక్తుల చెంతకే వెళ్లి దర్శనమివ్వడం బ్రహ్మోత్సవాల మరో ప్రత్యేకం.

నారసింహస్వామి కాలుమోపిన ‘ఖాద్రీ’

శ్రీమహావిష్ణు దశావతారాల్లో ఒకటైన నారసింహస్వామి కదిరి ప్రాంతంలో పాదం మోపినందున ఖాద్రీ అన్న పేరువచ్చిందనేది చరిత్రకారుల నమ్మకం. ‘ఖ’ అంటే విష్ణుపాదం ‘ద్రి’ అంటే కొండ అని అర్థం వస్తుంది. అందుకే కదిరికి ఖాద్రీ అన్న పేరు వచ్చింది. కాలక్రమేనా ఖాద్రీ కాస్తా కదిరిగా మారింది. ఇదే కాక మరో పురాణ గాఽథ కూడా ప్రచారంలో ఉంది. ‘ఖదిర’ అనే చండ్ర వృక్షం నుండి నారసింహుడు ఉద్భవించినందున ఈ క్షేత్రానికి ఖాద్రీ అన్న పేరు వచ్చిందని కూడా చరిత్ర ద్వారా తెలుస్తోంది.

స్వయంభువుగా వెలసిన శ్రీవారు

దేశంలో ఎక్కడా లేని విధంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడి సమేతంగా స్వయంభువుగా వెలిశారని ఆలయ చరిత్ర చెబుతోంది. నారసింహక్షేత్రాలకు భిన్నంగా కదిరిలో స్వయంభువుగా వెలసిన శ్రీవారు ప్రహ్లాద సమేతుడై గర్భాలయంలో భక్తులకు దివ్యమనోహరుడిగా దర్శనమిస్తారు. అష్టభుజుడైన నారసింహుడు దుష్టరాక్షసుడైన హిరణ్యకశిపుడిని తన తొడలపై ఉంచుకుని రెండు హస్తాలతో హిరణ్యకశిపుడి శిరస్సు, పాదములను అదిమిపట్టి, మరోరెండు చేతులతో వజ్ర తీక్షణమగు గోళ్ళతో రాక్షసుడి వక్షస్థలమును ఛేదిస్తుండగా, మిగిలిన నాలుగు చేతుల్లో శంకు, చక్ర, ఖేడ్య, ఖడ్గమును ధరించి ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు శ్రీవారి గర్బాలయానికి ఎడమ భాగాన మరో ఆలయంలో కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. నిత్యం అభిషేకం తర్వాత శ్రీవారి మూలవిరాట్టు వక్షస్థలం నుండి స్వేద బింధువులు ఉద్భవించడం కదిరి ఆలయ ప్రత్యేకత.

శ్రీవారి కల్యాణానికి ఎదురు వివాహమా?

ప్రతి ఏటా ఫాల్గున మాసంలో జరిగే కదిరి బ్రహ్మోత్సవాలకు ఓ ఆచారం తరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. నరసింహస్వామి ఉత్సవాల సమయంలో ఎంతటి బ్రహ్మ ముహూర్తాలు ఉన్నప్పటికీ కదిరిలో వివాహాలు జరగవు. అందుకు కారణంగా కదిరి ప్రాంతాన్ని పరిపాలించే ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి ఎదురు వివాహాన్ని స్థానికులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. నరసింహస్వామి కల్యాణోత్సవానికి ఎదురు వివాహం చేసుకోవడాన్ని ఇక్కడి ప్రజలు అరిష్టంగా భావిస్తారు. అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగిన నాటి నుంచి పదహారు రోజుల పాటు ఈ ప్రాంతంలో వివాహాలు జరగవు. అదేవిధంగా నారసింహ స్వామిని ఇలవేల్పుగా కొలిచేవారు బ్రహ్మోత్సవాల అనంతరం తీర్థవాది జరిగేంత వరకూ మాంసాహారాన్ని స్వీకరించరు.

కోనేటి స్నానం.. సర్వపాప హరణం..

ఆలయానికి పడమర భాగాన అర్జుననది ఒడ్డున భృగుతీర్థం(కోనేరు) కొలువై ఉంది. అక్కడ భృగు మహర్షి తపస్సు చేసి శ్రీవారిని స్మరించుకున్నారు. అ మహర్షి కోరికమేరకు శ్రీవారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలు అందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ఉత్సవ విగ్రహాలే ఇప్పటికీ కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నాయి. భక్తులు తొలుత భృగుతీర్థంలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం.

రెండు టన్నుల తేరు మోకులు

శ్రీవారి బ్రహోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం బ్రహ్మరథోత్సవం(తేరు). దక్షణభారత దేశంలోనే మూడవ పెద్దది పేరు పొందన తేరును లాగేందుకు భారీ మోకులను ప్రత్యేకగా తయారు చేస్తారు. మోకుల తయారీలో పేరొందిన కాకినాడ జిల్లా తాళ్లరేవులో తేరు మోకులను సిద్ధం చేశారు. 24 అంగులాల చుట్టుకొలత, 550 అడుగుల పొడవున్న ఈ మోకు రెండు టన్నుల బరువు ఉంటుంది. వీటిని తయారు చేయడానికి 50మంది కార్మికులు పదిరోజులపాటు శ్రమించారు. ఈ మోకుల తయారీ కోసం రూ.నాలుగు లక్షలు చెల్లించినట్లు ఆలయ వర్గాల సమాచారం.

కదిరి మల్లెలు.. దవణం ప్రత్యేకత

కదిరి పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది కదిరి మల్లెలు, కుంకుమ, దవణం. కదిరి మల్లెల సువాసన మరే ప్రాంతంలోనూ ఉండదన్నది స్థానికుల అభిప్రాయం. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత సువాసనతో గుభాలించడాన్ని గమనించవచ్చు. ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే దవణం, మరువం సౌరభాలు ఖాద్రీశుడికి ఎంతో ఇష్టం. తిరుమాడ వీధుల్లో బ్రహ్మరథం వెళ్తుండగా భక్తులు దవణం, మెరియాలు చల్లి తమ మొక్కులను తీర్చుకుంటారు.

అబ్బురపరిచే ఆలయ శిల్పకళ

కృతయుగంలో ఉద్భవించిన లక్ష్మీనరసింహ స్వామి కోసం పట్నం పాలేగాళ్లు 10వ శతాబ్ధానికి ముందే ఆలయాన్ని నిర్మించినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నారసింహుడి ఆలయం ఉన్న చోట 10వ శతాబ్ధం మధ్య కాలంలో పశ్చిమ చాళుక్య రాజవంశీయులు దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు. 1245లో హరిహరరాయలు, బుక్కరాయలు నృసింహుడి సాలగ్రామాలను, అచ్చుతరాయలు అష్టభుజుడైన నృసింహుడి ఉత్సవ మూర్తులను దుర్గాదేవి ఆలయంలో ప్రతిష్టించడంతో లక్ష్మీనారసింహడుడి క్షేత్రంగా పేరొందింది. భృగుతీర్థంలో కొలువై ఉన్న శ్రీవారి ఉత్సవమూర్తులను వసంత రుతువులో వెలికి తీసి ప్రతిష్టించడం వల్ల నరసింహస్వామిని ‘వసంత వల్లభుడు’ అని కూడా పిలుస్తారు. శ్రీవారికి మహాభక్తులైన 12 మంది అళ్వార్లు రంగ మండపాన్ని, కొక్కంటి పాలెగాళ్ళు పడమర గోపురాన్ని, తాడిపత్రి పాలెగాళ్ళు కొటాయి మండపాన్ని నిర్మించారు.