ArticlesNews

“సమాజ సేవే … భగవత్ సేవ” – సంత్ గాడ్గే బాబా  

160views

పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించిన.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా. సామాజిక న్యాయం కోసం ఆ మహనీయుడు అవిశ్రాంతంగా పోరాడారు. తన యావత్ జీవితాన్ని సమాజ సేవ కోసం అర్పించిన సర్వ సంగ పరిత్యాగి ఆయన. గాడ్గే బాబా పేరుతో మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందిన ఆయన అసలు పేరు డేబూ లేదా డేబూజి. 1876 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన మహారాష్ట్ర జిల్లాలోని దర్యాపూర్ జిల్లా షేన్ గ్రామంలో జింగారా, శకు అనే దంపతులకు గాడ్గేబాబా జన్మించారు. ఆయన ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి మరణించారు. దాంతో గాడ్గే బాబా కుటుంబం జీవనాధారం కోల్పోవడంతో మేనమామ ఆశ్రయం పొందవలసి వచ్చింది. మేనమామ అప్పగించిన పొలం పనులు చూస్తూ…. ఖాళీ సమయాల్లో గాడ్గే బాబా తన చుట్టూ గ్రామస్తులను చేర్చి భజన పాటలు పాడుతూ… పాడిస్తూ ఉండే వారు. గాడ్గే బాబాకు 15 ఏళ్ల ప్రాయంలోనే కుంతాబాయి అనే యువతితో వివాహమైంది. ఆయన ఎప్పుడూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే వారు. ప్రజల వెనుకబాటుతనం, మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే వారు. ప్రజలకు అనేక విధాలుగా సంస్కరణ మార్గాన్ని చూపించారు. గాడ్గేబాబాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. గాడ్గే బాబా తన జీవితాన్ని భగవంతుని సేవలో గడపాలని నిర్ణయించుకున్నారు.

“సమాజ సేవే … భగవత్ సేవ” అన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. 1905వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఇల్లు వదిలి వెళ్లి భక్తి మార్గంలో పయనమయ్యారు. అప్పటి నుండి గాడ్గే రూపం మారిపోయింది. ఒంటి మీద చివికి పోయిన దుస్తులతో ఉండేవారు. అలాంటి దుస్తులను మరాఠీ భాషలో గొధాడే అని అంటారు. దాంతో ఆయనకు గోధాడే బాబా అన్న పేరు వచ్చింది. ఒక వెదురు కర్ర, చిన్న పాత్ర కూడా ఆయనతో ఉండేవి. వాటిని మరాఠీ భాషలో గాడ్గే అని అంటారు. అప్పటి నుంచి ఆయనకు గాడ్గేబాబా పేరు స్థిరపడి పోయింది. ఆ రూపంలో మహారాష్ట్ర అంతటా కాలి నడకన తిరుగుతూ… ప్రజలను కలుస్తూ వారికి హితబోధలు చేసేవారు. మరాఠీ ప్రజానీకం ఆయనను సుమారు 50 ఏళ్లపాటు తమ గురువుగా భావించింది. ప్రజలకు గాడ్గేబాబా బోధనలు చాలా సరళంగా హృదయానికి హత్తుకునేలా ఉండేవి. ముఖ్యంగా భక్త తుకారాం కీర్తనలను ఆలపించి వివరించే తీరు అందరినీ అలరించేది. గాడ్గే బాబా పండరీపురం, నాసిక్, ఆలంది వంటి అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించారు. “భగవంతుడు అనే వాడు ఒక్కడే ఉంటాడు. మానవులు, జంతువులు అన్న తేడా లేకుండా సృష్టిలోని అన్ని ప్రాణులనూ సమానంగా ప్రేమించడమే ఆయనను చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం” అన్నది గాడ్గేబాబా బోధనల సారాంశం. అంతే కాదు కుల వివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు, జంతు బలులు, మద్యపానం వంటి దుర్గునాలను తీవ్రంగా నిరసించారు. నీతి, నిజాయితీగా జీవించడం, పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమని బోధించే వారు. ఒకసారి గాడ్గే బాబా ప్రవచనం చెబుతుండగా ఆయన కుమారుడు మరణించినట్టు వార్త వచ్చింది. ఈ వార్త విన్న ఆయన ఎంత మాత్రం తొనక లేదు. ఆ ఆవేదన కూడా అసలు మనసులోకి రానివ్వలేదు. ” ఈ ప్రపంచంలో రోజూ కోటాను కోట్ల జీవులు చనిపోతూ ఉంటాయి. వాటిలో ఒకే ఒక జీవి కోసం నేనెందుకు విలపించాలి ? అని ఆయన అనుకున్నారు. గాడ్గే బాబా కేవలం మాటలు మాత్రమే కాదు తాను ప్రవచించే బోధనలను ఆచరించి చూపేవారు. తనకు వచ్చిన విరాళాల మొత్తాన్ని ఆయన పండరీ పురం, నాసిక్, దేహూ, పూణే, ముంబయి తదితర చోట్ల నిరుపేదల కోసం అన్నదాన కేంద్రాలు, సత్రాలు, చలివేంద్రాలు, వృద్ధాశ్రమాలు నిర్మించారు. గాడ్గే బాబా వ్యక్తిత్వం ఎంతో విశిష్టమైనది. అణగారిన వర్గాల పట్ల అంతులేని అభిమానం, నిరుపేదలకు చేయూత నందించాలన్న తపన ఆ మహనీయుడు ప్రవచించిన బోధనలు నేటి తరానికి అనుసరణీయం.