శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య నెలకొని ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు. వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్ అలెన్‌చాంగ్‌టెరాన్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదన్‌రెడ్డి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్‌చాంగ్‌టెరాన్ తెలిపారు.