మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివార్ల రథోత్సవం కన్నులపండువగా జరిగింది. కల్యాణమూర్తులైన పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచగా క్షేత్రపాలకుడైన జనార్ధన స్వామి వెంట రాగా వైభవంగా రథోత్సవం సాగింది. రథం ముందు కుంభం పోశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు రవితేజ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ స్వామికి పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. భక్తులు శంభోశంకర అంటూ శివ నామస్మరణ చేస్తూ తన్మయత్వంతో రఽథాన్ని ముందుకు లాగారు. గంట తర్వాత రథం నాచువారి సెంటర్‌కు చేరుకుంది. వన్‌టౌన్ సీఐ అడబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి యర్రంశెట్టి భద్రాజీ, ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు, ఈవో అరుణ్‌కుమార్, దేవస్థానం చైర్మన్ కోడె విజయలక్ష్మి, ధర్మకర్తలు పర్యవేక్షించారు. అలాగే భీమేశ్వర స్వామి రథోత్సవాన్ని గ్రంధి రవితేజ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావులు పూజలు చేసి ప్రారంభించారు.
సోమేశ్వరస్వామి, పార్వతీ అమ్మవార్లకు ఆదివారం తెల్లవారుజామున వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. కొవ్వాడకు చెందిన గొట్టుముక్కల వారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా కల్యాణం నిర్వహించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో భీమేశ్వర, మహిషాసుర మర్ధిని అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు.
క్షీరా రామలింగేశ్వరస్వామి ఊరేగింపు…
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతీ అమ్మవార్లను ఆదివారం సాయంత్రం రావణాబ్రహ్మ వాహనంపై ఉరేగించారు. శనివారం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో దగ్గులూరుకు చెందిన వరదా సోమేశ్వరరావు, రామకోటి దంపతులు నేసిన 18 అడుగుల వెడల్పు, 360 మూరల పొడవు కలిగిన మల్లన్నపాగాను స్వామివారి ఆలయ శిఖరం నుంచి గాలి గోపురానికి ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం స్వామికి అభిషేకాలు, పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలం కరించారు.