News

చార్ ధామ్ యాత్ర తేదీల ఖరారు.. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం

159views

వార్షిక చార్ధామ్ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సంప్రదాయం ప్రకారం శివరాత్రిని పురస్కరించుకొని ఉభీమర్లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఇవి పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20న భైరవ్‌నాథ్‌ పూజలు చేయడంతో ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజున ఉభీమర్ లోని ఓంకారేశ్వర్నాథ్ మందిరం నుంచి కేదార్‌నాథ్‌ స్వామి పల్లకీ బయలుదేరుతుంది. రాత్రికి గుప్తకాశీలోని విశ్వనాథ్ మందిరంలో బసచేస్తారు. 22న పాఠ, 23న గౌరీకుండ్లకు వెళ్తుంది. 24న కేదర్‌నాథ్‌ పల్లకీ చేరుకుంటుంది. ఏప్రిల్ 25న ఉదయం 6.20 గంటలకు కేదర్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంటుంది. అక్షయ తృతీయ అయిన ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. బద్రీనాథ్‌కు ముఖ ద్వారంగా భావించే జోషీమఠ్‌లో ఇటీవల కొండచరియలు కూలి ఇళ్లకు పగుళ్లు ఇచ్చిన నేపథ్యంలో అందరి దృష్టీ ఈ యాత్ర నిర్వహణపై పడింది. అయితే.. జోషీమఠ్ ప్రభావం ఈ యాత్రపై ఉండబోదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ, పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ చెప్పారు. గత ఏడాది 45 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి అంత కన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.