
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఏకాదశి పండుగను పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రి రోజున శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో జరిగే తిరునాళ్ల మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు మొక్కుబడి ప్రభలతో కొండకు తరలివచ్చారు. నరసరావుపేట నుంచి చిన్నారులు కాలినడకన ప్రభలతో కోటయ్య సన్నిధికి చేరుకున్నారు. భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. కొండదిగువున సోపానమార్గం వద్ద ఉన్న విఘ్నేశ్వస్వామి, ఆనందవల్లి ఆలయాల్లో పూజలు చేశారు. ధ్యాన శివుడు, నాగేంద్రస్వామి పుట్ట వద్ద పూజల్లో భక్తులు పాల్గొన్నారు. పొంగళ్లు చేసి స్వామికి సమర్పించారు. శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. ఆలయ ఈవో వేమూరి, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు దేవస్థానం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలుగుదేశం నాయకుడు నల్లపాటి రామచంద్ర ప్రసాదు, నరసరావుపేటకు చెందిన శ్రీ షిరిడీసాయి అన్నదాన కమిటీ, వాసవి సేవా సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం, పులిహోర, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. కొండ దిగువన దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కలెక్టర్ శివ శంకర్ లోతేటి, శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
రేపు కోటప్పకొండ తిరునాళ్లు..
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినాన శనివారం అంగరంగ వైభవంగా తిరునాళ్ల జరుగనుంది. తిరునాళ్లలో భారీ ప్రభలు కొలువుదీరనున్నాయి. ఇందుకోసం సమీప గ్రామాల్లో పోటాపోటీగా ప్రభలను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్రభ 90 అడుగులకు పైగా ఎత్తులో రూపుదిద్దుకుంటోంది. సంస్కృతి, సంప్రదాయాలకు ఈ ప్రభలు అద్దం పడతాయి. కొండపై కొలువున్న కోటయ్యస్వామి కిందకు దిగి రావాలంటే కోటిన్నొక్క ప్రభ నిర్మించాలన్నది స్థల పురాణం చెపుతోంది. అందుకే ఈ తిరునాళ్ళకు అధిక సంఖ్యలో ప్రభల నిర్మాణం జరుగుతుంది.





