మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి

ఒడిశాలోని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని స్వామీజి చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘అమెరికన్ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. మహమ్మద్, క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని రుజువైంది’’ అని చెప్పారు. మన దేశంలో దేవాలయాలు, మఠాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని చెప్పారు. ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం నిధులను ఖర్చు చేయాలని అన్నారు.
పూరిలోని రత్న భండార్ తాళాలు కనిపించకపోవడం గురించి ప్రశ్నించినపుడు స్వామి మాట్లాడుతూ, దేవాలయానికి సంబంధించిన ఏ విషయంలోనూ తనను ఒడిశా ప్రభుత్వం కానీ, జగన్నాథ దేవాలయం యంత్రాంగం కానీ సంప్రదించలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు.
జగన్నాథ దేవాలయంలో ఏడు ఖజానాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. నాలుగు ఖజానాల తాళాలు 38 సంవత్సరాల క్రితం కనిపించకుడా పోయాయి. జిల్లా కలెక్టర్ వద్ద రెండు తాళాలు ఉన్నాయని ఆయన తెలిపారు.





