News

రామచరిత మానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతపై కేసు నమోదు

89views

రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై మంగళవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295A, 298, 504, 505(2), 153A కింద లక్నోలోని ఐష్‌బాగ్‌ నివాసి శివేంద్ర మిశ్రా ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.

రామచరితమానస్‌లోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదకపై పెద్ద సంఖ్యలో ఉన్న ఒక వర్గాన్ని అవమానిస్తోందని, తక్షణం ఆ అభ్యంతరకర భాగాలను నిషేధించాలని మౌర్య గత ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ”మతం అనేది మానవ సంక్షేమం, పటిష్టతకు ఉద్దేశించినది. జాతి, వర్ణం, వర్గాన్ని ఉద్దేశించి రామచరితమానస్‌లో పేర్కొన్న కొన్ని పదాలు సమాజంలో అత్యధికంగా ఉన్న ఒక వర్గాన్ని కించపరచేలా ఉన్నాయి. అలాంటప్పుడు నిశ్చయంగా అది ధర్మం కానేరదు. అది అధర్మమే అవుతుంది. ఆయా వర్గాలకు చెందిన లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అందులోని కొన్ని పదాలు ఉన్నాయి. జనాభాలో సగభాగమైన మహిళల మనోభావాలను కూడా రామచరితమానస్‌లోని శ్లోకాలు కించపరచేలా ఉన్నాయి. తులసీదాస్ రామచరితమానస్‌పై చర్చ జరగడమే అమమానకరమని భావిస్తే, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మహిళలను కించపరచడాన్ని ఎందుకు మతపెద్దలు పట్టించుకోవడం లేదు? ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మహిళలు హిందువులు కారా?” అని మౌర్య ప్రశ్నించారు. రామచరితమానస్‌లో అభ్యంతరక భాగాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.