News

క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోసం యోగా చేయాలి – ప్రధాని మోదీ సూచన

232views

దేశంలో క్రీడలను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగా పరిగణించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఒక క్రీడా ఈవెంట్‌ను ప్రారంభించిన సందర్భరంలో వ్యాఖ్యానించారు. క్రీడాకారులను తమ ఆహారంలో మిల్లెట్‌ను చేర్చుకోవాలని కోరారు. ఒకప్పుడు క్రీడలను కాలయాపన చేసే సాధనంగా భావించేవారని, అందుకే ఆటలు ముఖ్యం కాదనే మనస్తత్వం వేళ్లూనుకున్నదని, ఫలితంగా చాలా మంది ప్రతిభావంతులు క్రీడా మైదానాలకు దూరంగా ఉన్నారని ప్రధాని అన్నారు. అయితే గత ఎనిమిదేళ్లలో దేశం ఈ పాత ఆలోచనను వదిలివేసింది. క్రీడలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేశామని, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు, యువకులు క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నారని అన్నారు.

క్రీడాకారులు ఫిట్‌గా ఉండేందుకు యోగాను తమ దైనందిన జీవితంలో చేర్చుకోవాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడికి తాను ఫిట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో తెలుసని మరియు ‘ఫిట్ ఇండియా ఉద్యమం’ ఇందులో తన పాత్రను కలిగి ఉందని అన్నారు. ఫిట్‌నెస్ కోసం, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను చేర్చుకోవాలని సూచంచారు. అది వారిని ఆరోగ్యవంతంగా చేస్తుందని.. మనస్సును అప్రమత్తంగా ఉంచడంలో సహాయపడుతుందని బస్తీలో ‘సంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23’ రెండవ దశను ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశ పోటీ డిసెంబర్ 10 నుండి 16, 2022 వరకు నిర్వహించబడింది. బుధవారం ప్రారంభమైన రెండవ దశ జనవరి 28 వరకు కొనసాగుతుంది.

ఆడపిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. మహిళల అండర్-19, T-20లో షెఫాలీ వర్మ ఒక ఓవర్‌లో ఐదు ఫోర్లు మరియు ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేయడం గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం అన్ని స్థాయిలలో క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి.. ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తోందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 2,500 మందికి పైగా అథ్లెట్లకు ‘ఖేలో ఇండియా’ క్యాంపెయిన్ కింద ప్రతి నెలా రూ.50,000 కంటే ఎక్కువ ఇస్తున్నారని చెప్పారు.